రింగయ్యారు.. ఖంగుతిన్నారు | Sakshi
Sakshi News home page

రింగయ్యారు.. ఖంగుతిన్నారు

Published Thu, May 26 2016 2:00 PM

bhadrachalam auction Postponed

 భద్రాద్రిలో వేలం పాట వాయిదా

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దుకాణాల నిర్వహణ తదితరాల కోసం బుధవారం వేలం పాటల నిర్వహణలో పాటదారులంతా రింగయ్యారు. కాంట్రాక్ట్ కాల పరిమితిని ఏడాది కాకుండా మూడేళ్లకు పెంచాలని, లేకపోతే తామంతా వేలం పాటకు దూరంగా ఉంటామని దేవస్థానం అధికారులతో తెగేసి చెప్పారు. కార్యనిర్వహణాధికారిణి(ఈఓ) కూరాకుల జ్యోతి ఒక మెట్టు దిగి, కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించేందుకు అంగీకరించారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. వీరంతా రింగయ్యారని, తక్కువ మొత్తంతో ఎక్కువ కాలంపాటు పాట పాడుకునేందుకు పన్నాగం పన్నారని గ్రహించిన ఈఓ.. మొత్తంగా వేలం పాటలనే రద్దు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో పాటదారులంతా ఖంగుతిన్నారు. ఇలా, కథ అడ్డం తిరగడంతో.. ‘దీన్నంతటికీ నువ్వే కారణం’ అంటూ, పాటదారులు తమ ‘రింగ్’ లీడర్‌పై కస్సుబస్సుమన్నట్టు సమాచారం.
 
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పరిధిలో దుకాణాలను అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు బుధవారం జరగాల్సిన వేలం పాట వాయిదా పడింది. పర్ణశాల దేవాలయం వద్ద కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించేందుకు, కుటీరం వద్ద ఫొటోలు తీసేందుకు, సీతవాగు వద్ద గైడ్ లెసైన్స్ హక్కుల కోసం, భద్రాద్రి దేవాలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఫొటోలు తీసుకునేందుకు అధికారులు వేలం పాట పెట్టారు. దుమ్ముగూడెం మండలం కాశీనగరం వద్ద 2.67 ఎకరాల భూమిని మూడేళ్లపాటు కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహించారు. కాశీనగరం భూమి కౌలు ఏడాదికి గతంలో రూ.16,200 ఉంది. ఇది ప్రస్తుతం రూ.20వేలకు వెళ్లింది. దీంతో దీనిని దేవస్థానం అధికారులు ఖాయం చేశారు.

పాటలన్నింటికీ తీవ్రమైన పోటీ ఏర్పడింది. పాటదారులంతా కాల పరిమితి పెంచాలని డిమాండ్ లేవనెత్తారు. గతంలో ఏడాదికి మాత్రమే లెసైన్స్ హక్కులు ఇచ్చేవారు. దీనిని మూడేళ్లకు పెంచకపోతే పాటలో పాల్గొనేది లేదని వారు తెగేసి చెప్పారు. వాస్తవంగా, భద్రాచలం దేవ స్థానంతోపాటు, పర్ణశాల వద్ద ఫొటోలు తీసేందుకు గతంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, వచ్చిన పాటదారులంతా.. వేలం కాల పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించకపోతే వేలంపాటకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. వేలం పాట నిర్వహించేందుకు వచ్చిన ఇన్‌చార్జ్ ఏఈఓ కనకదుర్గ, సూపరింటెండెంట్ వెంకటప్పయ్య, సెక్షన్ ఇన్‌చార్జ్ పోతుల శ్రీను చర్చించుకున్నారు. విషయాన్ని దేవస్థానం ఈఓ జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు.

పాటదారుల డిమాండుకు ఈఓ కొంతవరకు తలొగ్గారు. కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతామంటూ ఒక మెట్టు దిగొచ్చారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. మూడేళ్లకు పొడిగిస్తేనే వేలం పాటలో పాల్గొంటామని బెట్టు చేశారు. అందరూ ఇదే మాటపై ఉండడాన్నిబట్టి, వారంతా రింగయ్యారని ఈఓ గ్రహించారు. వారి డిమాండును అంగీకరిస్తే దేవస్థానం ఆదాయం తగ్గే పరిస్థితి ఉండడంతో.. ఏకంగా వేలం పాటల నిర్వహణను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతా పాటదారులు ఖంగుతిన్నారు. వారిలో కొంతమంది.. తమ ‘రింగ్’ లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాట ఆగిపోవడానికి కారణమయ్యావంటూ నిందించారు.

నేడు విస్తా కాంప్లెక్స్ దుకాణాలకు వేలం
గోవిందరాజ స్వామి ఆలయం వద్ద, విస్తా కాంప్లెక్స్‌లోని పలు దుకాణాల నిర్వహణకు గురువారం వేలం నిర్వహించనున్నట్టు దేవస్థానం అధికారులు ప్రకటించారు.  పాదరక్షలు భద్రపరిచేందుకు, పడమర మెట్ల పక్కన పూజాది సామాగ్రి విక్రయించేందుకు మంచి పోటీ ఉండే అవకాశముంది. గతంలో వీటిని దక్కించుకున్న వారే తిరిగి పొందేందుకు పావులు కదుపుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement