బహుముఖం | Sakshi
Sakshi News home page

బహుముఖం

Published Wed, Mar 19 2014 4:26 AM

bhahumukam

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో ఘట్టం పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగిసింది. తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఎంతమందన్నది తేలింది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీల వార్డు సభ్యుల పదవుల కోసం ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

మొత్తం 210 వార్డులకు 1,311మంది తుది బరిలో నిలిచారు. అత్యధికంగా కోదాడలో 362 నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. మిర్యాలగూడలో 36 వార్డులకు 351 మంది పోటీ పడుతున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40వార్డులకు 220మంది పోటీ పడుతున్నారు.

పోటాపోటీ....

 దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయనుంది. చాలా చోట్ల కాంగ్రెస్‌కు ఇంటిపోరు ఎక్కువఉంది. ఆఖరి వరకు టికెట్  ఆశించి భంగపడ్డ వారంతా రెబల్స్‌గా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులపై రెబల్స్‌దే పైచేయి ఉండొచ్చని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల  కాంగ్రెస్.. ఇతర పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగాయి. టీడీపీకి అన్ని వార్డుల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. అయితే ఆయా మున్సిపాలిటీల్లో స్థానికంగా క్యాడర్‌ని బట్టి కొన్ని పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి.
 భువనగిరిలో వర్గపోరు....

 భువనగిరి కాంగ్రెస్‌లో వర్గపోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడున్న 30 వార్డుల్లో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయితే ఎంపీ వర్గం, స్థానిక నేత వర్గం తమ అభ్యర్థులను వేర్వేరుగా రంగంలోకి దింపాయి. ప్రధానంగా పోటీ కూడా వీరి మధ్యే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వర్గపోరును టీడీపీ సానుకూలంగా మలుచుకోవడానికి తహతహలాడుతోంది. మొత్తం గా బరిలో 175 మంది నిలిచారు.

 సూర్యాపేటలోనూ రెబల్స్ బెడద...

 ఈ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద ఉంది. ఉన్న 34 వార్డుల్లో కాంగ్రెస్ ఒంటిరిగా బరిలోకి దిగింది. 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ పోటీపడుతున్నారు. టీడీపీ32, బీజేపీ 31 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాయి. టీడీపీతో కొన్ని వార్డుల్లో రెబల్స్ తలపడుతున్నారు. టీఆర్‌ఎస్, సీపీఐ పొత్తు కుదుర్చుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. తుదిపోరులో 193మంది నిలిచారు.
 

మిర్యాలగూడలో...
 

ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అన్ని వార్డుల్లో బరిలోకి దిగింది. టీడీపీ, సీపీఎం 25 చొప్పున, బీజేపీ 11 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాయి. అయితే కొన్ని వార్డుల్లో టీడీపీ, సీపీఎం ఒప్పందానికి వచ్చాయి. ఇంకొన్ని వార్డుల్లో కాంగ్రెస్, కాంగ్రెస్సేతర పార్టీలు ఏకమయ్యాయి. మొత్తం మీద ఈ మున్సిపాలిటీల్లో పురుపోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం 36 వార్డుల్లో 351 మంది బరిలో నిలిచారు.

 కోదాడలో కూటములుగా..
 

కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయనుంది. ఇక్కడ టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎంలు కూటమిగా ఏర్పడ్డాయి. మరోపక్క టీఆర్‌ఎస్, సీపీఐ జతకట్టాయి. దాదాపు పది వార్డుల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 30 వార్డుల్లో 175 మంది త లపడుతున్నారు.

 దేవరకొండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒంటరిగా..
 

దేవరకొండ నగర పంచాయతీలో మొత్తం 99 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. 8, 9, 12 వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు చైర్మన్ స్థానానికి ఎంపికయ్యే అవకాశముంది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒంటరిగానే బరిలోకి దిగాయి. టీడీపీ, బీజేపీ పొత్తులు కుదుర్చుకున్నాయి.
 

హుజూర్‌నగర్...
 

హుజూర్‌నగర్ నగరపంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, టీడీపీలు కూటములుగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, సీపీఐ కూటమిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌కు ఇక్కడా రెబల్స్‌పోరు తప్పడం లేదు. నాలుగు వార్డుల్లో కాంగ్రెస్‌కు, రెండు వార్డుల్లో టీడీపీకి రెబల్స్ బెడద ఉంది. మొత్తం 20వార్డుల్లో 98 మంది అభ్యర్థులు తలపడనున్నారు.
 

నల్లగొండలో టీడీపీ, కాంగ్రెస్‌లకు రెబెల్స్ బెడద

 నల్లగొండలో కాంగ్రెస్, టీడీపీకి అధికంగా రెబల్స్ భయం పట్టుకుంది. 40 వార్డుల్లో దాదాపు 20వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలిచారు. టీడీపీకి కూడా 16 వార్డుల్లో రెబల్స్ తలపడుతున్నారు. కొన్ని వార్డుల్లో టీడీపీ, బీజేపీ, ఇంకొన్ని వార్డులో సీపీఎం, టీఆర్‌ఎస్ కలిసి సర్దుబాటు చేసుకున్నాయి. ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా వారు కలిసి తిరుగుతున్నారు. అంతేగాక ఇక్కడి   మొత్తం 40 వార్డులో ఉండగా వీటిలో 220మంది తుది బరిలో నిలిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement