పల్లెకే మళ్లీ పగ్గాలు | Sakshi
Sakshi News home page

పల్లెకే మళ్లీ పగ్గాలు

Published Mon, Feb 29 2016 3:33 AM

పల్లెకే మళ్లీ పగ్గాలు

* బీజేపీ జిల్లా సారథి గంగారెడ్డి
* ఆనందరెడ్డికి అధిష్టానం బుజ్జగింపు
* పోటీచేసే యోచన నుంచి విరమణ
* పార్టీ కార్యాలయంలో నేడు ప్రకటన
* రాష్ట్ర కమిటీలో ఆనందరెడ్డికి స్థానం
* సీనియర్ల చొరవతో ఎన్నిక ఏకగ్రీవం


సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ జిల్లా పగ్గాలు మళ్లీ పల్లె గంగారెడ్డికే దక్కనున్నాయి. ఆయనను రెండోసారి జిల్లా అధ్యక్షునిగా కొనసాగించేందుకు పార్టీ నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

శనివారం పార్టీ సీనియర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్యులతో అభిప్రాయ సేకరణ జరిపారు. జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపిన కేశ్‌పల్లి ఆనందరెడ్డితో మాట్లాడిన మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఆనంద్ రెడ్డి గట్టి నిర్ణయంతో ఉండగా, రెండోసారి జిల్లా అధ్యక్షునిగా కొనసాగేందుకు పల్లె గంగారెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ   రాష్ట్ర పరిశీలకులు, పార్టీ సీనియర్లు ఆనందరెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడటం తో పునరాలోచన చేసిన ఆయన పోటీ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.

పార్టీ అధిష్టానం జరిపిన అభిప్రాయ సేకరణ, సీనియర్లతో సంప్రదింపులు ఫలించడంతో మళ్లీ గంగారెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆనందరెడ్డి, గంగారెడ్డిల మధ్యన సత్సంబంధాలు, ఆనందరెడ్డి పెద్ద మనసు చేసుకుని విరమించుకోవడం వల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం కానుందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గంగారెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే కాగా.. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పల్లె గంగారెడ్డి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆనందరెడ్డికి రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం కల్పించేందుకు అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అంతర్గత కలహాలను వీడిన కమలనాథులు,  జిల్లా సారథి ఏకగ్రీవంపై కలిసి కట్టు గా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ , లోక భూపతిరెడ్డి తదితరులు రెండు రోజులుగా పార్టీ నేతలు, క్యాడర్‌తో సంప్రదింపులు జరి పా రు. కేశపల్లి ఆనందరెడ్డి, గంగారెడ్డి ఎన్నికపై సానుకూలత వ్యక్తం చేయ డం ‘ఏకగ్రీవం’ మరింత సుగమం అయినట్లు చెబుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షపదవితో పాటు అన్ని కమిటీలపై ఏకాభిప్రాయానికి రావాలన్న యోచన కూడ నాయకత్వం చేస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, కేశ్‌పల్లి ఆనందరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, గోపాల్, మల్లేశ్‌యాదవ్ తదితరులు గ్రూపులకు అతీ తంగా సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగే ఆ పార్టీ కొత్త సార థి ఎన్నికల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
అన్ని స్థాయిల్లో కమిటీలు
2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ యత్నం ఫలించలేదు. ఆఖరి నిముషంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యంగా మారింది. జిల్లాలో అప్పటికీ పార్టీ ఒంటిరిగా పోటీ చేసి నెగ్గేంత పటిష్టంగా లేదన్న సాకుతో అధిష్టానం జిల్లా నాయకత్వాన్ని పొత్తులకే సై అనిపించింది. దీంతో పార్టీపై కొండంత ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ బీజేపీ నాయకుల ఆశలు అడియాసలు అయ్యాయి. ఏళ్ల తరబడి ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాల్లో రూ.లక్షలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించిన నేతల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

పొత్తులలో భాగంగా 9 అసెంబ్లీ స్థానాలకు నాలుగు చోట్ల పోటీచేసే అవకాశం దక్కినా.. టీడీపీ నేతలు సహకరించక, టీఆర్‌ఎస్ హవాలో ఓట మి తప్పలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. జిల్లా నాయకు ల్లో నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ సభ్యత్వ సేకరణ ద్వారా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వార్డు కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అన్ని స్థాయిల్లో కమిటీలను పటిష్టం చేసే పని పెట్టుకున్నారు. ఇదే క్రమంలో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement