బాలుడిని చిదిమేసిన వ్యాన్ | Sakshi
Sakshi News home page

బాలుడిని చిదిమేసిన వ్యాన్

Published Mon, Feb 9 2015 11:32 PM

బాలుడిని చిదిమేసిన వ్యాన్ - Sakshi

తొమ్మిదేళ్ల బాలుడిని డీసీఎం వ్యాన్ చిదిమేసింది. పాలు తీసుకొచ్చేందుకు సైకిల్‌పై బయల్దేరిన అతడిని వ్యాన్ ఢీకొట్టడంతో చక్రాల కిందపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో మొయినాబాద్ మండలం చిలుకూరులో విషాదం అలుముకుంది.  
 

- సైకిల్‌ను ఢీకొన్న వ్యాన్
- వెనుక చక్రాల కిందపడి దుర్మరణం
- మొయినాబాద్ మండలం చిలుకూరులో ఘటన
మొయినాబాద్ రూరల్: డీసీఎం వ్యాన్ ఓ బాలుణ్ని బలిగొంది. పాలు తీసుకురావడానికి సైకిల్‌పై వెళ్తున్న బాలుణ్ని ఢీకొనడంతో వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ‘అప్పుడే నీకు నూరే ళ్లు నిండాయారా తండ్రీ.. ’ అంటూ మృతుడి తల్లి రోదించిన తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీంద్రనాయక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వినోదను కొన్నేళ్ల క్రితం రాజేంద్రనగర్ మండలం ఖిల్లాస్‌ఖాన్ దర్గాకు చెందిన రాములు వివాహం చేసుకున్నాడు. దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి పిల్లలు వినయ్(9), అఖిల ఉన్నారు. బాలుడు వినయ్ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చిలుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా, కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు నెలల క్రితం వినోద కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో బాలుడు స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే పాలు తీసుకురావడానికి కిరాణా దుకాణానికి సైకిల్‌పై బయలుదేరాడు. ఈక్రమంలో కోళ్లలోడ్‌తో నగరానికి వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ (ఏపీ 28టీజీ 4702) వినయ్ సైకిల్‌ను ఢీకొంది. బాలుడు ఎగిరిపడడంతో డీసీఎం వెనుక చక్రాలు అతడి పైనుంచి వెళ్లాయి.

దీంతో అతడి తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు మృత్యువాత పడడంతో వినోద గుండెలుబాదుకుంటూ రోదించింది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి తల్లి వినోద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement