Sakshi News home page

నగరంలో మరో బయోకాన్‌ యూనిట్‌

Published Sat, Feb 24 2018 3:19 AM

Biocon Unit in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ నగరంలో కొత్తగా యూనిట్‌ ప్రారంభించనుంది. దీంతోపాటు ప్రస్తుత యూనిట్‌ను మరింత విస్తరించనుంది. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఇక్కడ బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షాతో సమావేశమయ్యారు. తమ అనుబంధ కంపెనీ సింజెన్‌ ద్వారా జినోమ్‌ వ్యాలీలో బయోకాన్‌ కొత్త ఆర్‌ అండ్‌ డి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ యూనిట్‌ ద్వారా 1,000 హై స్కిల్డ్‌ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. సంబంధిత వివరాలన్నీ త్వరలో అందిస్తామని మంత్రికి తెలిపారు. బయోకాన్‌ నూతన యూనిట్‌ ఏర్పాటును మంత్రి స్వాగతించారు. మజుందార్‌ షాకు ధన్యవాదాలు తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మంత్రి పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశమయ్యారు. నొవార్టీస్, బయోకాన్, మెర్క్, డెలాయిట్, జీఈ కంపెనీల సీఈఓలు, సీనియర్‌ ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. థాయ్‌లాండ్‌ వాణిజ్య ఉప మంత్రి, ఇటాలియన్‌ కాన్సుల్‌ జనరల్‌ తదితరులతోనూ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో కేటీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతినిధులు అభినందించారు. ఫార్మా సిటీ ఏర్పాటు వివరాలను మంత్రి వివరించారు. హైదరాబాద్‌ స్టార్టప్‌ ఈకో సిస్టమ్‌ గురించి ప్రస్తావించారు. కిరణ్‌ మజుందార్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో నగరంలోని 20 టాప్‌ స్టార్టప్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

జీఈ (సస్టెయినబుల్‌ హెల్త్‌ కేర్‌ సొల్యూషన్స్‌) ప్రెసిడెంట్, సీఈఓ టెర్రీ బ్రెసెన్హమ్‌తో కూడా కేటీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్‌ డివైజెస్‌ పార్కు గురించి వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీవర్క్స్‌లో జీఈ భాగస్వామి అవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. బయో టెక్నాలజీలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌లోని కంపెనీలు అందిపుచ్చుకునేందుకున్న అవకాశాలపైన మంత్రితో ఆమె చర్చించారు. త్వరలోనే జినోమ్‌ వ్యాలీ పర్యటనకు వస్తానని తెలిపారు. జినోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేటర్‌లో జీఈ భాగస్వాములవ్వాలని కేటీఆర్‌ కోరారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేన్సర్‌ డయాగ్నస్టిక్‌ కార్యక్రమాలను ఆమెకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ తో కలసి హెల్త్‌ కేర్‌ స్కిల్లింగ్‌ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్ధమని ఆమె తెలిపారు. 

థాయ్‌ బృందంతోనూ... 
అనంతరం థాయ్‌లాండ్‌ ఉప వాణిజ్య మంత్రి చుటిమా బున్యాప్రఫసారాతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. 20 థాయ్‌ కంపెనీలతో కూడిన బృందం తెలంగాణలో వ్యాపారావకాశాలపై చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, ఫార్మా సిటీ, జినోమ్‌ వ్యాలీ, హైదరాబాద్‌లో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో అవకాశాలపై బృందం ఆసక్తి చూపింది. తొలిసారి హైదరాబాద్‌ పర్యటనలోనే ఇక్కడి విధానాలు, పెట్టుబడి అవకాశాలు ఆకట్టుకున్నాయని చుటిమా తెలిపారు. ముంబైలోని ఇటలీ కాన్సూల్‌ జనరల్‌ స్టెఫానియా కస్టాన్జాతో కూడా కేటీఆర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో టెక్స్‌టైల్, ఫార్మా, సినీ, అనుబంధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. బయోటెక్‌ రంగంలో ఇటలీ ఇకో సిస్టమ్, ఇక్కడ కంపెనీలు సంయుక్తంగా పని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అగ్రిటెక్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, టెక్స్‌టైల్‌ రంగాల్లో పలు పెట్టుబడి అవకాశాలున్నాయని, అందుకు ముందుకొచ్చే ఇటలీ కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని కేటీఆర్‌ వివరించారు. ఆ మేరకు త్వరలో ఇటలీ కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో వ్యాపారావకాశాలు, పారిశ్రామిక విధానాలను వివరిస్తామని మంత్రికి ఆమె హామీ ఇచ్చారు. భారత్‌లో ఫార్మా అభివృద్ధి్దకి సవాళ్లు అనే అంశంపై ఫార్మా కంపెనీల సీఈఓలతో సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. మెర్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ సీఈఓ ఉదిత్‌ బత్రా, నొవార్టిస్, డెలాయిట్‌ కంపెనీల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.

కేటీఆర్‌పై ప్రశంసలు
కేటీఆర్‌పై కిరణ్‌ మజుందార్‌ షా ప్రశంసలు కురిపించారు. ‘‘ఆయన నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్‌ మరియు ఇన్నోవేషన్‌ పరిశోధనలకు బీజం పడింది. కేటీఆర్‌ లాంటి నాయకులను చూసినప్పుడు పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి కలుగుతుంది. ఇలాంటి నాయకులను బలపరచాలని అనిపిస్తుంది’’అంటూ కొనియాడారు. హైదరాబాద్‌ నగరాన్ని కూడా మజుందార్‌ షా ప్రశంసించారు. నగరం భవిష్యత్తులో మరింత పురోగతి సాధించేందుకు అయా రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.  

Advertisement
Advertisement