Sakshi News home page

‘సమరభేరి’కి సన్నద్ధం

Published Tue, Oct 9 2018 8:23 AM

BJP Next Meeting In Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పాగా వేసేందుకు బీజేపీ నిర్వహించే సమరభేరి సభకు అంబేద్కర్‌ స్టేడియం వేదిక కానుంది. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఉత్తర తెలంగాణాలో సత్తా చాటే పనిలో కరీంనగర్‌ను వేదిక చేసుకుంది. కమలనాథులకు ఒకప్పుడు మంచి పట్టున్న కరీంనగర్‌ నుంచే తమ ప్రచార శంఖారావం పూరించాలని బుధవారం జిల్లాకు అమిత్‌షాను రప్పిస్తోంది. ఇందులో బాగంగానే ఈనెల 10న కరీంనగర్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా, మహాకూటమికి దీటుగా బీజేపీ ఒంటరిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని చేపట్టి పట్టుసాధించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.

అమి త్‌షా సభకు మరో రోజు మాత్రమే ఉండటంతో సభ ఏర్పాట్లు, జన సమీకరణపై ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకత్వం కరీంనగర్‌లో మకాం వేసింది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు సోమవారం కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ప్రెస్‌మీట్‌ నిర్వహించి సభ ఉద్దేశం, పార్టీ నిర్ణయాలు, జన సమీకరణ, అభ్యర్థుల ఖరారు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూటముల వైఖరిపై మాట్లాడారు. అనంతరం అంబేద్కర్‌ స్డేడియంలో సమరభేరి వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అమిత్‌ షాతో సమరభేరి సభ ద్వారా మొదలు కానుండగా, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ఉత్తర తెలంగాణాలో పట్టు బిగించాలని ఆ పార్టీ నాయకత్వం చూస్తోంది.

ఇదిలా వుండగా, ఈనెల 3, 4, 5 తేదీలలో హైదరాబాద్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక కసరత్తును కొలిక్కి తెచ్చారు. ఇదే సమయంలో అమిత్‌షా సభ సక్సెస్‌ కోసం 13 నియోజకవర్గాల వారిగా ఇన్‌చార్జీలను నియమించి సుమారు 1.25 లక్షల మందిని తరలించేలా పార్టీ శ్రేణులు కసరత్తు కూడా చేశారు. గుజరాత్, కర్నాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు పోలింగ్‌ బూత్‌ స్థాయిలో వేసిన కమిటీలకే ఓటర్ల బాధ్యతలను అప్పగించేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోయేందుకు కార్యాచరణ చేసింది.

ఇదే సమయంలో సోమవారం సమరభేరి సభ ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు ఆ సభ సక్సెస్‌ కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కరీంనగర్‌లో మకాం వేసి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. అంబేద్కర్‌ స్డేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన డాక్టర్‌ లక్ష్మణ్, దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి వెంట జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, ప్రతాప రామకృష్ణ, మహిళా నాయకురాళ్లు సుజాతరెడ్డి, గాజుల స్వప్న, సాయికృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement