పైసా కొడితేనే ‘ప్రమోదం’ | Sakshi
Sakshi News home page

పైసా కొడితేనే ‘ప్రమోదం’

Published Thu, Aug 21 2014 11:51 PM

పైసా కొడితేనే ‘ప్రమోదం’

లేకుంటే మర్డర్ చేసినా పట్టించుకోడు
మహిళల బట్టలూడతీస్తున్నారని తెలిసినా స్పందించని ఘనుడు
అర్ధరాత్రి వేళ ఇళ్లమీద పడి అందినకాడికి దోపిడీ
డబ్బు తీసుకొని అమాయకుల మీద కేసుల బనాయింపు
బదిలీ అయినా రద్దు చేయించుకున్న పైరవీకారుడు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/హత్నూర: హత్నూర మండలం కొన్యాల గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఈ నెల 12 అర్ధరాత్రి చాకలి అనసూజ, లక్ష్మి అనే ఇద్దరు మహిళలను అదే గ్రామానికి చెందిన కొందరు అత్యంత పాశవికంగా వివస్త్రలను చేసి, జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేసి కొట్టారు. దాహం వేస్తుందన్న వారికి మూత్రం తాగించారు. ‘జుట్టు కత్తిరించి.. బట్టలూడదీసి’ అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’ వార్త ప్రచురించేవరకు విషయం బాహ్య ప్రపంచానికి తెలియదు. ఈ దుర్మార్గాన్ని మానవతావాదులు తీవ్రంగా ఖండించారు.

వాస్తవానికి అదే రోజు రాత్రి అనసూజ భర్త యాదయ్య  హత్నూర పోలీసుస్టేషన్‌కు వె ళ్లి జరుగుతున్న దురాగతాన్ని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. కాపాడమని ఎస్‌ఐ కాళ్లు పట్టుకున్నాడు. కానీ ఆ ఎస్‌ఐ మాత్రం పోలీసు వ్యవస్థకే మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించాడు. కనీసం ఆ మహిళలను రక్షించే ప్రయత్నం చేయలేదు. తెల్లవార్లూ మహిళలను చిత్ర హింసలకు గురిచేస్తున్నా పట్టించుకోలేదు. కనీసం ఉదయమైనా గ్రామాన్ని సందర్శించి దురాగతానికి పాల్పడిన నిందితుల మీద కేసులు నమోదు చేశాడా? అంటే అదీ లేదు. తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించాడు.
 
అర్ధరాత్రి వేళ దాడి చేసి దోచుకుంటాడు
ఇక హత్నూర పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కే వారెవరైనా సరే చేతిచమురు వదిలించుకోవాల్సిందే. సారు ఠాణాలో రాజీ చేసినా, కేసు కట్టినా, నిందితులను అరెస్టు చేసినా... ప్రతి ‘పనికో రేటు’ పెట్టుకొని వసూలు చేస్తాడనే విమర్శలు ఉన్నాయి. కొన్ని నెలల కిత్రం ఇసుక ఫిల్టర్లు, ఇటుక బట్టీల యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి.  గుండ్లమాచునూర్ గ్రామంలో ఐదు నెలల క్రితం ఇసుక ఫిల్టర్ల యజమానులపై అర్ధరాత్రి దాడి చేసి వారి వద్ద ఉన్న నగదును దోచుకుపోయాడని బాధితులు తూప్రాన్ డీఎస్పీకి  ఫిర్యాదు చేశా రు. సదరు ఎస్‌ఐ చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు వ్యక్తులు తమకు న్యా యం చేయాలంటూ డీఎస్పీ, సీఐ చుట్టు చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ ఖాకీలు కేసు డీలా చేయడానికి ఇదిగో... అదిగో అంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పటివరకు బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదు.
 
ఏకంగా హత్యాయత్నం కేసు....
రెండు నెలల క్రితం బొర్పట్ల గ్రామంలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగితే, ఒక వర్గం దగ్గర మామూళ్లు తీసుకున్న ఎస్‌ఐ సారు.. నలుగురిపై హత్యాయత్నం కేసి నమోదు చేసి, కేసులో లేని వ్యక్తులను సైతం అరెస్టు చేసి జైలుకు పంపాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల దౌల్తాబాద్, దౌలాపూర్ గ్రామాలలో కేబుల్‌వైర్లు దొంగతనం చేసిన దొంగను స్థానికులు పోలీసులకు పట్టించినా, కేసులు పెట్టకుండా వదిలేశారనే ఆరోపణలను ఎస్‌ఐ ఎదుర్కొన్నారు. రెండు రోజుల క్రితం కాసాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఘర్షణ జరిగిన విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అతనితోనే పోలీసు స్టేషన్‌కు సీలింగ్ ఫ్యాన్ తెప్పించుకున్న ఘనుడు ఈ అధికారి.

నాగారంలో ఇద్దరు ప్రేమికులు ఊరు నుంచి పారిపోతే, ఒక వర్గం వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ప్రేమికుడిని నానా విధాలుగా భయపెట్టి చివరకు ఇద్దరు ప్రేమికులను వేరు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత నెలలో మండలంలోని కొన్యాల, మాధుర గ్రామ శివారుల్లోని వ్యవసాయ బోరు బావులకు సంబంధించిన సుమా రు పది విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు పగలగొట్టి ఆయిల్, విలువైన కాపర్‌వైర్లను అపహరించుకుపోవడంతో పాటు రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఎస్‌ఐకి తెలిసినప్పటికీ కావాలనే ఆ దొంగలను పట్టుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
 
బదిలీ అయినా వదల్లేదు..
ఇటీవల జిల్లాలో పెద్ద ఎత్తున ఎస్‌ఐల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే హత్నూరఎస్‌ఐని కూడ సంగారెడ్డి సీపీఎస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా పేట్ బషీరాబాద్ ఠాణాకు చెందిన సుధాకర్ అనే ఎస్‌ఐకి పోస్టింగు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో కానీ బదిలీ రద్దు అయింది. సారు గారిది ఇష్టారాజ్యమైంది.

Advertisement
Advertisement