నలుగురికి ప్రాణదాత... ఆ బాలుడు | Sakshi
Sakshi News home page

నలుగురికి ప్రాణదాత... ఆ బాలుడు

Published Wed, Jul 15 2015 1:07 AM

నలుగురికి ప్రాణదాత... ఆ బాలుడు - Sakshi

పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 12 ఏళ్ల బాలుడికి బ్రెయిన్‌డెడ్ అయింది. అయితే, ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అతని తల్లిదండ్రులు... తన కొడుకు మరణించినా నలుగురి ప్రాణాలు నిలిపి చిరంజీవి కావాలని అవయవదానం చేశారు.  నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ కథనం ప్రకారం ... ప్యారడైజ్ బాలంరాయి వద్ద నివాసం ఉండే పి.సత్యనారాయణ జీఎంఆర్ కార్గోలో మేనేజర్. భార్య విమల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వీరికి వైష్ణవ్ (12) కొడుకు ఉన్నాడు. సత్యనారాయణ దంపతులు ఈనెల 12న కారులో వైష్ణవ్‌తో పాటు బంధువుల పిల్లలు ముగ్గురితో కలిసి రామోజీ ఫిలింసిటీ వద్ద నుంచి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో కారు వెనుక కూర్చున్న నలుగురు పిల్లలలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా వైష్ణవ్‌కు తీవ్రగాయాలయ్యాయి.   కారు నడుపుతున్న సత్యనారాయణకు ఛాతీపై బలమైన గాయాలు కాగా.   విమల కాలు విరిగింది. ముగ్గురినీ వెంటనే సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైష్ణవ్‌ను అక్కడి నుంచి లక్డికాపూల్‌లోని గ్లోబల్  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వైష్ణవ్‌కు మంగళవారం బ్రెయిన్ డెత్ అయింది.  జీవన్‌దాన్ ప్రతినిధులు సన్‌షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ, విమల వద్దకు వెళ్లి విషయం చెప్పి వారిని వైష్ణవ్ అవయవాలను దానం చేసేందుకు ఒప్పించారు. వైద్యులు వైష్ణవ్ శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం, గుండెను తొలగించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ఎయిర్‌ఫోర్టుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Advertisement
Advertisement