కొడుకు ఆచూకీ కోసం... | Sakshi
Sakshi News home page

కొడుకు ఆచూకీ కోసం...

Published Mon, Jul 20 2015 2:44 AM

కొడుకు ఆచూకీ కోసం... - Sakshi

♦ కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ తండ్రి
♦ మూడు నెలల క్రితం బీదర్‌లో అదృశ్యమైన బాలుడు
 
 జహీరాబాద్ : మూడు నెలల క్రితం అదృశ్యమైన కొడుకు ఆచూకీ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు ఓ తండ్రి. కొడుకు ఆచూకి తెలిస్తే తెలపండి అంటూ ఎరుదుపడిన వారినళ్లా దీనంగా వేడుకుంటున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. జహీరాబాద్‌కు సమీపంలో ఉన్న కర్ణాటకలోని బీదర్ పట్టణానికి చెందిన ఎం.డి.యూసూఫ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు ముజమ్మిల్(12) బీదర్‌లోని మైలూర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మూడు నెలల క్రితం పాఠశాలకు వెళ్లిన ముజమ్మిల్ ఇంటికి రాలేదు.

దీంతో బీదర్ పరిసరాల ప్రాంతంలో గాలించినా ఎలాంటి సమాచారం దొరకలేదు. అప్పటి నుంచి కొడుకు ఆచూకీ కోసం పనులు మానుకుని వెతుకుతూనే ఉన్నాడు. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని మూడు రోజులుగా తిండి నిద్రహారాలు మాని కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. హోటళ్లు, దాబాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో గాలించాడు. అయినా ఎలాంటి సమాచారం దొరకలేదు. తన కుమారుడి ఫొటోను చూపుతూ ఎక్కడైనా కనిపించాడా అంటూ అడుగుతున్నాడు. కుమారుడి జాడ తెలిస్తే సెల్ నంబర్ 09663503105 నంబర్‌కు సమాచారం ఇవ్వమని వేడుకుంటున్నాడు.

Advertisement
Advertisement