ఉజ్వల భవిష్యత్తుకు ‘భవిత’ | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవిష్యత్తుకు ‘భవిత’

Published Thu, Apr 28 2016 3:24 AM

ఉజ్వల భవిష్యత్తుకు ‘భవిత’

♦ నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ నాంది
♦ సాక్షి భవిత ఆవిష్కరణ వేడుకలో చుక్కా రామయ్య
♦ ‘సాక్షి’ కృషిని అభినందించిన వక్తలు
♦ కరీంనగర్‌లో ఘనంగా ఆవిష్కరణోత్సవం
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థులు, ఉద్యోగార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సాక్షి ‘భవిత’ పునాది వంటిదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. వార్తలే కాకుండా సమాజానికి ఉపయోగపడాలనే కాంక్షతో పత్రిక మెయిన్ ఎడిషన్‌లో రోజూ భవిత అనుబంధానికి 2 పేజీలు  కేటాయించి విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేస్తోందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాక్షి తెలుగు దినపత్రిక మెయిన్‌లో రోజూ ప్రత్యేకంగా అందిస్తున్న భవిత పేజీలను బుధవారం కరీంనగర్‌లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయెల్ డేవిస్‌లతో కలసి ఆయన ఆవిష్కరించారు.

నగరంలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సాక్షి నెట్‌వర్క్ ఇన్‌చార్జి కె.శ్రీకాంత్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు కాలేజీల విద్యార్థులు, ఉద్యోగార్థులు తరలివచ్చారు. ఎడిటర్ వి.మురళి ప్రారంభోపన్యాసం చేస్తూ భవితకు సాక్షి మెయిన్ ఎడిషన్‌లో 2 పేజీలు కేటాయించడం వెనుక ముఖ్య ఉద్దేశాలను వివరించారు. కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్, సాక్షి ఫైనాన్స్, అడ్మిన్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఎంసెట్  కన్వీనర్ రమణారావు, సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాసరావు, శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ మనోహర్‌రావు, సాక్షి మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, సర్క్యులేషన్ జీఎం సోమ సురేందర్ తదితరులు హాజరయ్యూరు.

 సాక్షి భవిత... ఒక దీక్ష: చుక్కా రామయ్య
 సాక్షి దినపత్రికకు భవిత ఒక దీక్ష అని చుక్కా రామయ్య అన్నారు. ‘‘నాలెడ్జ్ సెంటర్‌గా పేరొందిన కరీంనగర్‌లో భవితను ఆవిష్కరించడం ముదావహం. విద్యారంగ బీజా లు వేయడానికి కరీంనగర్ జిల్లా అనువైన ప్రాంతం. ఈ డిజిటల్ యుగంలో వర్తమాన విషయాలే గాక భవిష్యత్తు అంశాలను కూడా భవిత ద్వారా విద్యార్థులు నేర్చుకోవచ్చు.  విద్యా రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు పలు అంశాలపై సాక్షి భవిత అందిస్తున్న సమాచారం విలువైంది.’’ అని చెప్పారు.

 భవిత.. దిక్సూచి కావాలి: కలెక్టర్ నీతూప్రసాద్
 ఏటా ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని విద్యార్థి లోకం గమనించి ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టి సారించాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. ఇక నుంచి ఆకాశమే హద్దుగా పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ‘భవిత’ ద్వారా సాక్షి విలువైన సమాచారం అందించడం అభినందనీయమన్నారు. డిజిటల్ యుగపు మార్పులకనుగుణంగా విద్యార్థులు  పయనించాలని సూచించారు. అవగాహనలేని విద్యార్థులకు భవిత దిక్సూచి కావాలన్నారు.

 భవితతో భావి ప్రణాళిక: ఎస్పీ జోయెల్ డేవిస్
 గ్రామీణ నిరుద్యోగ యువత ఉన్నత చదువులు, పోటీ పరీక్షలు, ఉద్యోగాలపై అవగాహన లేక నష్టపోతున్నారని ఎస్పీ జోయెల్ డేవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రణాళిక రూపొందించుకునేలా సాక్షి భవిత దిశానిర్దేశం చేస్తోందని అభినందించారు. కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేనివారికి సాక్షి భవిత ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

 అన్ని వర్గాలకూ స్థానం: సాక్షి ఎడిటర్ మురళి
 విద్యా రంగానికే కాకుండా రైతులు తదితర అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యతతో అవసరమైన సమాచారాన్ని సాక్షి ఎనిమిదేళ్లుగా అందిస్తూనే ఉందని ఎడిటర్ మురళి అన్నారు.  పోటీ పరీక్షలకు కీ పేపర్ తయారు చేయడం సాక్షితోనే ప్రారంభమైందని, చాలాసార్లు వంద శాతం సరైన సమాధానాలిచ్చి లక్షలాది మంది మన్ననలు చూరగొన్నామన్నారు.

 భవితకు అత్యధిక ప్రాధాన్యం: వైఈపీ రెడ్డి
 ఎనిమిదేళ్లుగా ఎన్ని ఇబ్బందులొచ్చినా విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే సాక్షి భవితకు పత్రికలో అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఫైనాన్సియల్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భవిత వేదికగా మారాలని ఆకాంక్షించారు. నాలుగో తరగతి నుంచి మొదలుకుని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యతోపాటు ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి సమాచారమూ అందిస్తామన్నారు.

 పరీక్ష విధానంలో వినూత్న మార్పులు: గురజాల
 పోటీ పరీక్షల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాస్‌రావు అన్నారు. గ్రూప్స్‌తోపాటు అన్ని పోటీ పరీక్షల్లోనూ సమకాలీన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. కాబట్టి భవిత మెటీరియల్‌నూ విశ్లేషణాత్మకంగా ఇవ్వాలని కోరారు.

 కాలేజీల ఎంపిక కీలకం: రమణారావు
 ఎంసెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు భవిత ఎంతో ఉపయోగకరమని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కావాల్సిన ప్రశ్నలు, జవాబులతోపాటు కాలేజీలు, గ్రూప్‌ల ఎంపిక తదితర విషయాలను భవిత ద్వారా అందించాలని కోరారు. సాక్షి అందిస్తున్న భవితతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ప్రొఫెసర్ మనోహర్ అన్నారు.  సాక్షి భవిత అద్భుతమని తహసీల్దార్ జయచంద్రారెడ్డి అభినందించారు.
 
 ఉద్యోగ ఎంపికకు దోహదం
  ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. క్యాంపస్‌లో ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కోచింగ్ సెంటర్‌కు వెళ్లాను. సాక్షి భవిత నాకెంతగానో ఉపయోగపడింది. భవిత, విద్య పేజీల ద్వారా ఎంతో ప్రాక్టీసైంది. పలు నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో భవిత పేజీలను ప్రతి రోజూ అందించడం అభినందనీయం’’          
     - అరుణశ్రీ, డీఆర్‌డీఏ పీడీ
 
 భవితతోనే ఉద్యోగం సాధించా
 ‘‘నేను సాక్షి భవిత చదివే ఉద్యోగాన్ని సాధించా. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పద్ధతులతో పాటు ఉద్యోగానికి సంబంధించిన అంశాలు భవితలో చాలా చక్కగా ఉంటాయిు. భవితతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం సామాజిక బాధ్యతగా స్వీకరించిన సాక్షికి ధన్యవాదాలు’’
 - నవాబ్ శివకుమార్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్

Advertisement
Advertisement