ఎన్నో ఏళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు | Sakshi
Sakshi News home page

ఎన్నో ఏళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు

Published Thu, Dec 11 2014 2:21 AM

ఎన్నో ఏళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్న చిన్నారులు - Sakshi

ఉద్వేగం..ఉద్విగ్నం
కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు, పిల్లలు
జువైనల్ హోంలో పలువురిని తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు

 
సైదాబాద్: చెడు వ్యసనాలకు బానిసై ఇంటినుంచి పారిపోయి వచ్చిన వారు కొందరు...తల్లిదండ్రులు పనికి పంపిస్తున్నారని మరికొందరు..ఇంట్లో కొడుతున్నారని ఇంకొందరు.. ఇలా పలు కారణాలతో తల్లిదండ్రులకు దూరమై రైల్వే ఫ్లాట్‌ఫాంలపై జీవించి, చివరకు జువైనల్ హోంకు వచ్చిన బాలలు పలువురు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేరారు.

ఎన్నో ఏళ్ల తరువాత పిల్లలను కలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికిలోనై బోరున ఏడ్చేశారు. పిల్లలు సైతం ఏడుస్తూ తల్లిదండ్రులను చుట్టేశారు. ఈ భావోద్వేగ సంఘటనలు చూసి అధికారులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. సైదాబాద్‌లోని బాలల సదనంలో సాథీ, ఆశ్రీత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఈ సందర్భంగా సదనం నుంచి బయటకు వెళ్తున్న బాలలందరికీ ప్రముఖ వ్యాపారవేత్త శశికాంత్ అగర్వాల్  కొత్త దుస్తులు అందించారు. చెడుదారి పట్టిన తమను మార్చి, విద్యాబుద్ధులు చెప్పించిన బాలల సదనం అధికారుల మేలు ఎప్పటికీ మర్చి పోలేమని కొంతమంది చిన్నారులు రోదిస్తూ చెప్పారు. అనంతరం జరిగిన సమావేశంలో జువైనల్‌హోం డెరైక్టర్ వి. భాస్కరాచారి మాట్లాడుతూ మొత్తం 32 మంది బాలలను తల్లిదండ్రుల వద్దకు పంపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి శ్రీనివాస్, చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ మెంబర్ శ్యామలాదేవి, డిప్యూటీ డెరైక్టర్ కుమారస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్, డాక్టర్ శ్రీనివాస్, అశ్రీత సంస్థ డెరైక్టర్ నాగరాజు, సాథీ సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అవుతా: శివ
మాది ఈసీఐఎల్ నాగారం. చిన్నప్పుడు మా మవయ్య కొట్టాడని ఇంట్లోంచి పారిపోయి రైల్వేస్టేషన్ చేరుకున్నాను. ఒక రోజు రైల్వే స్టేషన్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో పెద్ద గాయం అయింది. దీంతో పోలీసులు సైదాబాద్ బాలల సదనంలో చేర్పించారు. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆరేళ్ల తర్వాత కన్నవారిని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను బాగా చదువకుని పోలీస్ అవుతా.

Advertisement

తప్పక చదవండి

Advertisement