Sakshi News home page

తెలుగుజాతి ఐక్యతకు కృషి చేద్దాం

Published Sun, May 18 2014 12:46 AM

తెలుగుజాతి ఐక్యతకు కృషి చేద్దాం - Sakshi

  •      తెలంగాణపై  సీపీఎంది ఒకే మాట
  •      పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వీరభద్రం
  •  వనస్థలిపురం, న్యూస్‌లైన్: సైద్ధాంతికంగా సీపీఎం సమైక్య రాష్ట్రాన్ని బలపరిచి చివరి వరకు ఆదే మాటపై ఉందని, ఇతర పార్టీలు ప్రాంతాల వారిగా ఒక్కోచోట ఒక్కోలా మాట్లాడాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఎల్‌బీనగర్‌జోన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం వనస్థలిపురంలోని బొమ్మిడి నర్సింహారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన ‘ప్రజల ఆకాంక్ష ప్రభుత్వ బాధ్యత’ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఆయన మాట్లాడుతూ తెలంగాణ వెనుకబాటుకు, దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, అందుకే ఆ పార్టీతో పొత్తులకు దూరంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌తో సీపీఐ పార్టీ పొత్తు పెట్టుకుని ఖమ్మంలో సీపీఎంను దెబ్బతీయాలని చూసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తమ పార్టీ తీసుకున్న వైఖరి తెలంగాణలో విజయవంతమైందని పేర్కొన్నారు.

    కాంగ్రెస్, బీజేపీలను ఓడించడానికి తమ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఖమ్మంలో వైఎస్సార్‌సీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. సీపీఐ కార్యదర్శి నారాయణ తమపై వేసిన నిందలకు క్షమాపణ చెప్పకుంటే ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలకు పూనుకుంటామని హెచ్చరించారు. బీసీలు, దళితులను ముఖ్యమంత్రులను చేయడమే సామాజిక న్యాయం కాదని, వ్యక్తులు కాకుండా ఆ కులాల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

    నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటే చాలదని.. గిరిజన తండాల్లో అందరికీ సంపూర్ణ వైద్యం అందాలన్నారు. రాష్ట్రం విడిపోయిన వాస్తవాన్ని అందరూ గుర్తించి తెలుగుజాతి ఐక్యతను పెంచడానికి కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలని, వారికి తమ పార్టీ సహకారం ఉంటుందన్నారు.

    సీపీఎం పార్టీలో కొన్ని నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయని, నోముల నర్సింహయ్య లాంటి వ్యక్తులు తుచ్ఛమైన పదవుల కోసం పార్టీని వదిలి వెళ్లడం అలాంటిదేనన్నారు. కమ్యూనిస్టుల్లో అనైక్యత, తృతీయ కూటమిలో సందిగ్ధత వల్లనే బీజేపీ అధికారంలోకి రాగలిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, గ్రేటర్ హైదరాబాద్ సౌత్‌జోన్ కార్యదర్శి సోమయ్య, జోన్ కార్యదర్శి చంద్రమోహన్ పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement