పాపిరెడ్డికాలనీలో కార్డన్ ఆపరేషన్ | Sakshi
Sakshi News home page

పాపిరెడ్డికాలనీలో కార్డన్ ఆపరేషన్

Published Mon, Aug 4 2014 12:37 AM

Cardon operation in papi reddy colony

చందానగర్: శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో ఆదివారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు కార్డన్ ఆపరేషన్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ రాణా, క్రైమ్ ఇన్‌చార్జి డీసీపీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీ, సందయ్యనగర్, వాంబే గృహాలు, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్పలో మొత్తం 2,624 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, 30 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 250 మంది కానిస్టేబుళ్లు 20 బృందాలుగా ఏర్పడి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉదయం 5.30కి మొదలైన తనిఖీల్లో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించి అందులో నివసిస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తనిఖీలు జరుగుతున్నంత సేపు బయటి వారిని లోనికి, లోని వారిని బయటకు వెళ్లనివ్వలేదు. 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురికి నేర చరిత్ర ఉంది. ఆయా బస్తీల్లో వాహనాలను తనిఖీ చేయగా 33 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 2 కార్లకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సురేష్ అనే కరడుకట్టిన నేరస్తుడు చిక్కాడు. ఇతనిపై హత్య, అత్యాచారం, నాలుగైదు దొమ్మీ కేసులున్నాయని డీసీపీ రాణా తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement