నకి‘లీలలు’ తెలుసుకో.. రైతన్నా మేలుకో.. | Sakshi
Sakshi News home page

నకి‘లీలలు’ తెలుసుకో.. రైతన్నా మేలుకో..

Published Sun, Jun 15 2014 3:24 AM

నకి‘లీలలు’ తెలుసుకో.. రైతన్నా మేలుకో.. - Sakshi

- ఖరీఫ్ సాగుపై జాగ్రత్తలు అవసరం
- నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
- వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి

ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే.. ఆది నుంచే అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కి దున్నింది మొదలు.. పంట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. సాగుకు అవసరమయ్యే ప్రతి వస్తువు కొనుగోలులో, చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లలో అత్యంత జాగ్రత్తలు అవసరం. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలి. విత్తన ఎంపిక నుంచి, పంట దిగుబడి పొందే వరకు శాస్త్రీయంగా సేద్యపు పద్ధతులు అవలంభించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే అన్నదాత పడ్డ ఆరుగాలం శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. రైతన్న మోమున ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే ఆ దిశగా అడుగులు వేయాలి.
 - నిజామాబాద్ వ్యవసాయం
 
 విత్తనాలు కొనే ముందే
- వ్యవసాయ శాఖ లెసైన్సు పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.
- సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి.
- బస్తాపై రకం పేరు, లాట్ నంబరు, గడువు తేదీ తదితర వివరాలు గమనించాలి.
- కొనుగోలు బిల్లుతో పాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.
- పైవేటు విత్తన సంస్థలు పెద్ద ఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొనుగోలు చేయకూడదు.
- విత్తనాన్ని ఎన్నుకొనే ముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం ఎంతో మంచిది.
- మార్కెట్‌లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ధ్రువీకరించన విత్తనాలు విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తాపై నీలి వర్ణం(బ్లూ) ట్యూగు ఉందో లేదో గమనించాలి. ఈ ట్యాగు బస్తాకు కుట్టి సీల్ చేసి ఉంటుంది. దీనిపై వివరాలు పూర్తిగా తెలుసుకొని కొనుగోలు చేయాలి.
- ఫుల్ సీడ్ (లేబుల్ విత్తనం) కూడా మార్కెట్‌లో లభ్యమవుతోంది. వీటిని కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై లేత ఆకుపచ్చ ట్యాగ్ కుట్టి ఉంటుంది.
- దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్తనాలను రైతులు కేవలం ఆయా కంపనీల నమ్మకం మీదే కొనుగోలు చేయాలి. ట్యాగుపైన వివరాలు పూర్తిగా తెలుసుకొని వ్యాపారి నుంచి సరైన బిల్లు తీసుకొని కొనుగోలు చేయాలి.
- ఎలాంటి విత్తనం కొనుగోలు చేసినా తప్పక బిల్లు తీసుకోవాలి. బిల్లుపై పేరు, విత్తన రకం, తేదీ తదితర వివరాలు ఉన్నవో లేదో రైతులు సరి చూసుకోవాలి.
- పంటసాగు పూర్తయ్యే వరకు తప్పని సరిగా బిల్లును దాచి ఉంచాలి.
- బిడిల్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగు ఉందో లేదో చూడాలి. ఈ ట్యాగుపై విత్తనం భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే శాతం, జన్యు నాణ్యత వంటి వివరాలు ఉంటాయి.
- గడువు దాటిపోయిన విత్తనాలు కొనుగోలు చేయకూడదు.
- పంట మొలకెత్తే దశలో కానీ, పూత దశలో కానీ లోపం కనిపిస్తే వెంటనే మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలి.
- పత్తి విత్తనాల్లో జిన్నింగ్ చేసి ప్యాకింగ్ చేసిన వాటిని కొనుగోలు చేయరాదు.
 
ఎరువుల విషయంలో..
- నాణ్యమైన ఎరువులనే వాడాలి. పంటల అధిక దిగుబడికి రసాయన ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. అక్కడక్కడ కొందరు దళారులు, వ్యాపారులు నాసిరకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు పెట్టుబడులు సైతం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే ఆస్కారం ఉంది.
- లెసైన్సు దుకాణంలోనే ఎరువులు కొనుగోలు చేయాలి.
- కొనుగోలు చేసిన ఎరువుకు సరైన బిల్లు పొందాలి. బిల్లును జాగ్రత్తగా దాచాలి.
- డీలర్ బుక్కులో విధిగా రైతు సంతకం చేయాలి. మిషను కుట్టు ఉన్న ఎరువు సంచులను మాత్రమే కొనాలి. చేతితో కుట్టినట్లయితే దానిపై సీసంతో సీల్ ఉందో లేదో చూడాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉండాలి.
- రైతు తప్పని సరిగా బస్తాను తూకం వేయించి తీసుకోవాలి. చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తీసుకోవద్దు. ఎరువు వినియోగం అనంతరం ఖాళీ సంచులను పడేయడం, అమ్మివేయడం చేయకూడదు.
- ఇటీవల రైతులు సూక్ష్మ పోషకాలపై ఆసక్తి చూపుతున్నారు. అందమైన ప్యాకింగ్‌కు ఆకర్షితులు కాకుండా అధికారుల సిఫారసు మేరకు కొనాలి.
- కొనుగోలు చేసిన ఎరువు విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమానం ఉన్న ఎరువుల నమూనాలను రూ.10 డీడీ జత చేసి పరీక్షలకు పంపించాలి.
 
కల్తీని ఇలా గుర్తించవచ్చు..
- చెమ్మగిల్లి ఉన్న ఎరువుల్లో ప్రామాణికం, నాణ్యత లోపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్ప ఒక ఎరువులోని గుళికలన్నీ ఒకే రంగులో ఉంటాయి.
- అన్య పదార్థం ఎరువులో కనిపిస్తే దాన్ని కల్తీ ఎరువుగా గుర్తించాలి.
- సాధారంగా యూరియా, సంకీర్ణ ఎరువులు, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ గుళికల రూపంలో ఉంటాయి. 15:15:15 లేదా 20:20:0 రేణువుల రూపంలోనూ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి.
- 5 మి.లీ. పరిశుభ్రమైన నీరు (డిస్టిల్డ్ వాటర్) ఒక చెంచా ఎరువును బాగా కలిపిన తర్వాత అడుగున ఏమీ మిగలక స్వచ్ఛమైన ద్రావణం తయారవ్వాలి. ఈ ద్రావణం పరీక్ష యూరియా, అమ్మోనియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్లకు వర్తిస్తుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, అమ్మోనియం క్లోరైడ్ క్లోరైడ్ ఎరువులకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీరు వాడాలి.
- 15:15:15,  28:28:0,  19:19:19, 17:17:17,  14:28:14,  యూరియా 24:24:0 ఎరువులను పరీక్షించడానికి 5 మి.లీ.
 పరిశుభ్రమైన నీటిలో ఒక చెంచా ఎరువును బాగా కలిపితే ఆ ద్రావణం మడ్డీగా ఉంటుంది.
- కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు ఎరువుల తయారీలో మూల పదార్థ ఎరువుల పూత చుట్టేందుకు ఇసుక రేణువులను ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా డీఏపీ 17:17:17, 15:15:15: మొదలైన ఎరువులకు వాడతారు. ఈ ఎరువులు నీటిలో కరిగిన తర్వాత కనబడే ఇసుకను చూసి దీనిని కల్తీగా గుర్తించి ఉపయోగించకూడదు.
 
పురుగుల మందుల్లో...
- చీడపీడల నివారణలో వాడే క్రిమి సంహారక మందుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ సూచించే మందులనే కొనాలి.
- లెసైన్సు లేని దుకాణాల నుంచి కొనరాదు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి.
- లేబుల్ లేని మందు సీసా, డబ్బా, ప్యాకెట్ సంచులను కొనరాదు. మందు లేబుల్ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శాతం, పరిమాణం, విష ప్రభావం తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్ నంబర్లు, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషను విషయాలు పరిశీలించాలి.
- తప్పనిసరిగా అన్ని వివరాలతో బిల్లు పొందాలి.
- ఎరువుల మందుల్లో విషపూరిత పదార్థం స్థాయిని తెలిపేందుకు డైమండ్ ఆకారంలో తెలుపుతో మరో రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణ ఇలా ఉంటుంది. అత్యంత విషపూరితం ఎరుపు రంగు, అతి విషపూరితం పసుపు రంగు, విషపూరితం నీలరంగు, స్వల్ప విషపూరితం ఆకుపచ్చ రంగు.
- మందుల నిల్వలోనూ కొన్ని సూచనలు పాటించాలి.
- వాడిన మందు సీసా,డబ్బా, ప్యాకెట్ సంచులను విధిగా ధ్వంసం చేసి లోతైన గుంటలో పూడ్చేయాలి. మందులు కలిపిన వాడిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు.
 
 సస్యరక్షణ మందులు

- విచక్షణ రహితంగా సస్యరక్షణ మందులు వాడరాదు.
- గడువు దాటిపోయిన సస్య రక్షణ మందులను కొనుగోలు చేయరాదు.
- కారుతున్న, సీళ్లు సరిగా లేని మందులను కొనరాదు.
- లెసైన్సు లేని డీలర్లు సస్యరక్షణ మందులు విక్రయిస్తుంటే వెంటనే సమీప వ్యవసాయాధికారికి తెలియజేయాలి.
 
బిల్లులు పొందాలి

రైతులు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఏది కొనుగోలు చేసినా సంబంధిత దుకాణదారు నుంచి పూర్తి వివరాలతో తప్పకుండా బిల్లు పొందాలి. నకిలీదని తేలినప్పుడు ఈ బిల్లు ఆధారంగానే చర్యలు తీసుకోవచ్చు. కనుక విత్తనాలు, ఎరువుల కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఎలాంటి అనుమానం కలిగినా సమాచారం అందించాలి.
 - నర్సింహా, జేడీఏ, నిజామాబాద్

Advertisement
Advertisement