‘నోట్ల’ గుట్టు రట్టు | Sakshi
Sakshi News home page

‘నోట్ల’ గుట్టు రట్టు

Published Wed, Jun 10 2015 1:27 AM

‘నోట్ల’ గుట్టు రట్టు - Sakshi

- ఓ నిర్మాణ కంపెనీ ఖాతాలోకి కుప్పలుతెప్పలుగా చేరిన సొమ్ము
- ఆ ఖాతా నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుకు కోట్లు డ్రా చేసినట్టు రూఢీ
- స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన రూ.5 కోట్లు అందులోనివే
- ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో డబ్బు మూలాలను ఛేదించిన ఏసీబీ
- బేరసారాల్లో పాలుపంచుకున్న టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు
- సూత్రధారి చంద్రబాబుపైనా పక్కా ఆధారాలు, నేడు కేసు నమోదు!
- విచారణ కోసం బాబుకు నోటీసుల జారీకీ రంగం సిద్ధం
 
సాక్షి, హైదరాబాద్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలకలం సృష్టించిన నోట్ల కట్టల్లో దాగున్న గుట్టును ఏసీబీ ఛేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ.50 లక్షలకు సంబంధించిన మూలాలే ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ సొమ్ము ఎవరెవరి చేతులు మారిందన్న దానిపై ఏసీబీ అధికారులు లోతుగా జరిపిన దర్యాప్తులో అనేక  మంది బడాబాబుల పేర్లు బయటకొచ్చాయి.

ఆ నోట్ల కట్టలు ఓ నిర్మాణ కంపెనీకి చెందినవిగా గుర్తించడంతో ఈ కేసులో మొత్తం ఆధారాలు సేకరించినట్లయింది. బంజారాహిల్స్‌లో ఉన్న సదరు నిర్మాణ కంపెనీ ఖాతా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు సమీపంలోని ఓ బ్యాంక్‌లో ఉంది. అక్కడి నుంచే గత నెల 28, 29 తేదీల్లో పెద్ద ఎత్తున డబ్బును డ్రా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అంతకుముందు 15 రోజుల్లోనే ఆ ఖాతాలోకి భారీగా నిధులు వచ్చిపడినట్లు కూడా వెల్లడైంది.

ఆ డబ్బంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చిందన్నది తెలుసుకోవడంలో అధికారులు పురోగతి సాధించారు. సదరు ఖాతాలోకి నేరుగా జమ అయిన సొమ్ము వివరాలను బ్యాంక్ అధికారుల నుంచి ఏసీబీ బృందం సేకరించడంతో కీలక సమాచారం బయటపడింది. ఇందులో చంద్రబాబు సహా మరికొందరు టీడీపీ నేతల పాత్రను రూఢీ చేసుకున్న ఏసీబీ.. వారిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అలాగే చంద్రబాబును విచారించేందుకు ఆయనకు నోటీసులు కూడా జారీ చేయనుంది.

నిర్మాణ కంపెనీ అధినేతదే కీలకపాత్ర
తెలంగాణలో ఎలాగైనా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పట్టుదల చూపిన టీడీపీ నాయకత్వం ఇందుకోసం ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించే  బాధ్యతను సదరు నిర్మాణ కంపెనీ అధినేతకు అప్పగించింది. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలతో ఆయన నేరుగా సమావేశమయ్యారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో టీడీపీ మాజీ ఎంపీ ఒకరు కూడా ఉన్నట్లు తెలిసింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందే ఆ ఎమ్మెల్యేలకు కొంత అడ్వాన్స్‌ను ముట్టజెప్పినట్లు, ఈ భేటీకి సంబంధించిన సెల్‌ఫోన్ దృశ్యాలు కూడా ఏసీబీకి దొరికినట్లు సమాచారం. అయితే ముఖాలు సరిగా కనిపించకుండా వాటిలో స్పష్టత లోపించడంతో ఆ రెస్టారెంట్ యజమాని, సిబ్బందిని విచారించేందుకు దర్యాప్తు బృందం వెళ్లివచ్చినట్లు సమాచారం. అలాగే కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు, నిర్మాణ కంపెనీల నుంచి సదరు నిర్మాణ కంపెనీ అధినేత భారీగా డబ్బు సమకూర్చుకున్నట్లు తేలింది.

బేరసారాల్లో సీఎం రమేశ్, గరికపాటి
ఈ వ్యవహారంలో ఇప్పటికే చంద్రబాబును సూత్రధారిగా తేల్చిన ఏసీబీ.. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావుల పాత్రను కూడా రూఢీ చేసుకున్నట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు ఏసీబీ కస్టడీలో ఉన్న రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ చెప్పిన వివరాల ఆధారంగా వారిద్దరి పాత్రకు సంబంధించిన అనేక ఆధారాలను అధికారులు సేకరించారు.

ఇక ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టేనని న్యాయ నిపుణులు ఏసీబీకి నివేదిక ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఏసీబీ రాసిన లేఖ ఆధారంగా న్యాయశాఖ తరఫున నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద బాబును విచారించవచ్చని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కుట్రపూరిత నేరం కింద చంద్రబాబు, సీఎం రమేశ్, గరికపాటి పేర్లను కూడా బుధవారం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చనున్నట్లు అత్యున్నత అధికారవర్గాలు తెలియజేశాయి.
అలాగే సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద విచారణకు హాజరుకావాలని టీడీపీ అధ్యక్షుడికి నోటీసు ఇవ్వబోతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. నోటీసు అందుకున్న 48 గంటల్లోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోరనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement