Sakshi News home page

పైసల్లేవ్‌..!

Published Tue, Feb 27 2018 11:21 AM

cash shortage in banks farmers suffer - Sakshi

మంచిర్యాలఅగ్రికల్చర్‌: అన్నదాతకు నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజులగా బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రమైంది. పత్తి అమ్మిన పైసలు చేతికందడం లేదు. వ్యాపారులు ఇచ్చే నగదు ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నగదు కోసం బ్యాంక్‌కు వెళ్తే రూ.5వేలు, రూ.10వేలకు మించి ఇవ్వడం లేదు. దీంతో బ్యాంకుల చుట్టు రోజుల తరబడి తిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. పంటలు అమ్మిన సొమ్ము వేలల్లో ఖాతాల్లో జమ అవుతుంటే చేతికి నగదు అందడం లేదని వాపోతున్నారు. పత్తి ఏరేందుకు కూలీలకు డబ్బులు చెల్లించలేక తిట్లు తినాల్సి వస్తోందని అంటున్నారు. అకౌంట్‌ నుంచి మరో అకౌంటుకు బదిలీ చేస్తామంటే కూలీలు అలా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. తాము బ్యాంకుల చుట్టు తిరగలేమని, నగదే కావాలని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. పంట కోసం తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగిపోతోందని అంటున్నారు. దీంతో పలుచోట్ల నగదు కోసం బ్యాంకు అధికారులు రైతులు వాగ్విదానికి దిగుతున్నారు.

ఆర్‌బీఐ నుంచే ఆచితూచి..
నగదు కొరత కారణంగా చెస్టు నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు తక్కువ మొత్తంలో నగదు ఇస్తోందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. నగదు విత్‌డ్రాలు ఎక్కువగా ఉండటం, దానికి తగ్గట్టు డిపాజిట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. జిల్లాలో 119 వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. రైతులు రుణాలు తీసుకోవడవం, చెల్లించడంతో పాటు ఇతర నగదు లావాదేవీలకు గ్రామీణ బ్యాంకుల్లోనే అకౌంట్లు ఉన్నాయి. వీటితో పాటు ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, సహకార బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నిటిలో పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితే కనిపిస్తోంది. రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉండే తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో గతంలో వారానికి రూ. కోటి నుంచి రూ.3 కోట్ల వరకు నగదు వచ్చేది. ప్రస్తుతం రూ.10 లక్షలు, రూ.20 లక్షలకు మించి ఇవ్వడం లేదని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో విత్‌డ్రాలకు రూ.5 వేలు రూ.10వేలకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నామని తెలుపుతున్నారు.

రూ.53 వేలకు రూ.5 వేలే ఇచ్చిండ్రు
నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అకౌంటు ఉన్నది. పంట అమ్మిన పైసలు పది రోజుల కిందట జమ చేసిండ్రు. మొత్తం 53 వేలు బ్యాంకుల ఉన్నా.. రూ.5 వేలకు ఎక్కువ ఇవ్వమంటుండ్రు. లేకుంటే పైసలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామంటుండ్రు. పైసల కోసం ఇబ్బంది అయితంది. – కొండు రాజేశం, నెన్నెల

రూ.5 వేలకు ఎక్కువ లేవంటుండ్రు..
పత్తి అమ్మిన పైసలు రూ.60 వేలు బ్యాంకు ఖాతాలోనే జమ అయినయి. మా ఇంట్ల వచ్చే నెల 4వ తారీఖున పెండ్లి ఉన్నది. పెండ్లి సామాన్లు కొందామంటే బ్యాంకుల రూ.5వేల కంటే ఎక్కువ ఇవ్వమంటుండ్రు. ఖాతాలో పైసలు ఉండి బాకీ తీసుకునుడు అయితంది.– కొండు లక్ష్మి, నెన్నెల

వారం సంది తిరుగుతున్నా..
ఈనెల 12వ తేదీన పత్తి అమ్మిన. రూ.లక్ష నా ఖాతాలో జమ చేసిండ్రు. బ్యాంకుకు పోతే ట్రాన్స్‌ఫర్‌ చేస్తం.. లేదంటే రూ.5 వేలు ఇస్తం అంటుండ్రు. కూలీలు పైసల కోసం రోజూ ఇంటికి వస్తుండ్రు. వారం రోజుల సందడి బ్యాంకు చుట్టు తిరుగుతున్న.  – బీమరాజుల శ్రీనివాస్, నెన్నెల

Advertisement

తప్పక చదవండి

Advertisement