అటా...ఇటా..? | Sakshi
Sakshi News home page

అటా...ఇటా..?

Published Mon, Aug 25 2014 1:55 AM

caved employees in confusion

 భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల్లోని ఉద్యోగులు ఎటువైపు అనే విషయం మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ విధి విధానాలను ఇంకా వెలువరించకున్నప్పటికీ, ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యేకంగా పరిగణించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

ముంపు మండలాల్లో పనిచేసే ఉద్యోగులు వారికి నచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా అప్షన్ కల్పించే ందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ముంపు మండలాల్లోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు వివరాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. సదరు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేసే చోటనే ఉంటారా..? లేదా..? అనే అభిప్రాయాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ ఇలంబరితి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సైతం సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల్లో దీనిపైనే చర్చ సాగుతోంది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారు కోరుకున్న రాష్ట్రంలోనే పనిచేసేలా అప్షన్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ముంపు మండలాల్లో పాలన వ్యవహారాలను చూసే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అంటే ముంపులో పనిచేసే వారికి సెప్టెంబర్ నెల వేతనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి ప్పుడు ఉద్యోగులందరినీ వెనుక్కు తీసుకురావాలన్నా అనేక ఇబ్బందులు ఉంటాయి.

 వారందరినీ ఖమ్మం జిల్లాలో సర్దుబాటు చేయటం కూడా కష్టమే. ఆ స్థాయిలో ఇక్కడ ఖాళీలు కూడా లేవు. దీంతో వారిని ప్రస్తుతానికి అక్కడనే  పనిచేయించి, వేతనాలు ఏపీ ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి ముంపు ఉద్యోగుల జాబితాలను పంపించేలా కలెక్టర్ ఇలంబరితి చర్యలు చేపట్టారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముంపులో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన నివేదికలు సిద్ధమవుతున్నాయి.

 అయోమయంలో ముంపు ఉద్యోగులు...
 ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ ప్రాంత ఉద్యోగులు కొందరిలో అయోమయం నెలకొంది. ఇళ్లు, పొలాలు, బంధు వర్గాలను ముంపులో వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రావాలా..? లేక ఆ ప్రాంతంలోనే ఉండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. ముంపులోనే ఉంటే భవిష్యత్‌లో పునరావాసం కల్పించే సమయంలో రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందేమోననే సందేహం కూడా వారిని వేధిస్తోంది.

 ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి ఏమిటి...
ముంపు మండలాలైన చింతూరు, కూనవర ం, వీఆర్‌పురం, భద్రాచలం రూరల్, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన వారు ఉద్యోగ రీత్యా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ముంపు ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వీరికి ఏ విధంగా ఆప్షన్‌లు కల్పిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అదే విధంగా జిల్లా, జోనల్ స్థాయిలో పనిచేస్తున్న వారిలో కొంతమంది ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

దీంతో ఉద్యోగుల విభజన ఏ రీతిన చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమల్‌నాథన్ కమిటీ కేవలం రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజనకు మాత్రమే విధి విధానాలు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ ఆప్షన్ సౌకర్యం కల్పిస్తే భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఉద్యోగ  సంఘాల వారు అంటున్నారు. ఆ దిశగా ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు ఆలోచించాలని వారు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement