సీసీ కెమెరాలకు అనారోగ్యం..! | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలకు అనారోగ్యం..!

Published Sun, Oct 7 2018 8:10 AM

CC Cameras Not Working In Primary Health Centre Adilabad - Sakshi

ఉట్నూర్‌(ఖానాపూర్‌): ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలకు అనారోగ్యం పాలయ్యాయి. అధికారులు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ వాటి వినియోగంపై లేకపోవడంతో నిధులు వృథాగా అయ్యా యి. పీహెచ్‌సీల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ద్వారా సిబ్బంది రాకపోకలు, పనితీరు, గైర్హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు కొంత మెరుగైన వైద్యం అందించవచ్చనే ఐటీడీఏ ఆశయం నీరుగారుతోంది. ప్రభుత్వం నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా 2012–13లో ప్రభుత్వం ఐటీడీఏ అదీనంలోని గిరిజన ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా గిరిజనులకు పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించడం, సిబ్బంది సమయపాలన పాటించేలా చేయడంతోపాటు వారి గైర్హాజరును నివారించడం ద్వారా గిరిజనులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీలకు రూ.4.65 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో పీహెచ్‌సీకి రూ.15 వేలు వెచ్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పీహెచ్‌సీకి ద్వారం గుండా రాకపోకలు సాగిస్తున్న వారిని వారిని గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సీసీ కెమెరాల రికార్డింగ్‌ సిస్టంను కంప్యూటర్లకు అనుసంధానం చేయలేదు. దీంతో దంతన్‌పల్లి మినహా మిగతా పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి. ఫలితంగా అధికారుల పట్టింపు లేమితో గిరిజనుల అభివృద్ధికి వెచ్చించిన రూ.4.65 లక్షలు వృథాగా మారాయి.

ముందు చూపు లేమి..?
పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో ముందు చూపు లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏపీ నిధులు విడుదల కాగానే సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చర్యలు తీసుకున్నారు. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు అనువైన పరిస్థితుల్లో ఆయా పీహెచ్‌సీల్లో ఉన్నాయా లేదా అని ఆలోచించనట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమయ్యే కంప్యూటర్లు పూర్తి స్థాయిలో ఉన్నవి లేనిది గుర్తించ లేకపోయారు. 31 పీహెచ్‌సీల్లో కంప్యూటర్లు ఉన్నా అందులో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయనేదీ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం లేదు. పలు పీహెచ్‌సీల్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలావరకు పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేవని వైద్యాధికారులు అంటున్నారు.

పీహెచ్‌సీల్లో వైద్యుల పని తీరు, సమయ పాలన, సిబ్బంది గైర్హాజరు తదితర అంశాలు ఐటీడీఏ పీవో గాని, ఉన్నత వైద్యాధికారులు వారి కార్యాలయాల నుంచి పరిశీలించాలన్నా ఆన్‌లైన్‌ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా పీహెచ్‌సీలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పీహెచ్‌సీలో ఉన్న సీసీ కెమెరాల  ద్వారా ఉన్నతాధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించడానికి అవకాశం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో ఉపయోగపడని పనులకు అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించడంపై గిరిజనులు మండిపడుతున్నారు. అవే నిధులు గిరిజనుల ఆరోగ్యంపై ఖర్చు చేస్తే గిరిజనులకు మేలు జరిగేదని అంటున్నారు. పూర్తి స్థాయి చర్యలు తీసుకొని పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement