అభివృద్ధి చెందాల్సింది పాలమూరే | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చెందాల్సింది పాలమూరే

Published Sun, Dec 28 2014 3:03 AM

Cendalsindi development Palamuru

సాక్షి, మహబూబ్‌నగర్:తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటగా అభివృద్ధి చెందాల్సిన జిల్లా మహబూబ్‌నగర్ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రేషన్‌కార్డులు, సంక్షేమ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనానికి జనవరి 1నుంచి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరాపై జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ అధ్యక్షతన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అథితిగా మంత్రి రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా అనేక వివక్షలకు గురైందన్నారు. జిల్లా గుండా కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా పంటలకు నీళ్లు పారించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లెల్లో పల్లేర్లు మొలిచాయని, ఇక ముందు పచ్చగా మారేలా చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. సమగ్రకుటుంబ సర్వేపై దుష్ర్పచారంచేశారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రంలో కోటి ఆశలతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం కోసమే సర్వే చేసిందన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు పోతాయంటూ కొందరు విపక్షనేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. కానీ మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో 9,95,000 కార్డులు ఉంటే ప్రస్తుతం 10,16,961 ఇస్తున్నామన్నారు. కార్డులోని యూనిట్ల సంఖ్య కూడా ఆరు లక్షల వరకు పెరిగిందని వివరించారు. జిల్లాలో సంక్షేమహాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్నభోజనానికి ప్రతినెల 18,675 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
 
 పాలమూరుకే పెద్దపీట
 పారిశ్రామికంగా వెనుకబడిన పాలమూరు పెద్దపీట వేస్తామని పరిశ్రమల శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి ఖనిజ, అటవీ, సారవంతమైన భూములున్నాయని వాటిని ఉపయోగించుకునే అవకాశం రాలేకపోయిందన్నారు. ఇక నుంచి జిల్లాకు పెద్దపీట వేసి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంబంధించి జిల్లాకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ సెక్రటరీ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో అతి తక్కువ అక్ష్యరాస్యత ఉండడం వల్లే ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ ఫలాలు ప్రకటించినా అభివృద్ధి చెందడం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో అధికారులు తీవ్రంగా శ్రమించి రెండు, మూడు స్థానాలకు తీసుకెళ్లాలని సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నందున అక్రమాలకు తావివ్వకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తే బాగుంటుందన్నారు. ఆహారభద్రత హక్కు చట్టం కింద గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని, దాని ద్వారా ప్రతి ఒక్కరికీ ఐదు కిలోలు అందనుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటికి అదనంగా ఒక కేజీ చేర్చిందని చెప్పుకొచ్చారు. 2013లో పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన చట్టాన్నే రాష్ట్రం అమలులో పెడుతోందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు.
 
 జెడ్పీ చైర్మన్ వ్యాఖ్యలతో
 గందరగోళం...
 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కిందట ఆమోదించిన చట్టాన్ని మీరెందుకు అమలు చేయలేదంటూ ఎదురుదాడి చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అట్టడుగు వర్గాలకు అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూటు కాలికింద తొక్కిపెట్టారని నిప్పులు చెరిగారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో వేదిక మీదున్న మంత్రులు జూపల్లి, ఈటెల, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ జోక్యం చేసుకొని సర్దిచెప్పారు.
 జిల్లాకే అధిక ప్రాధాన్యం:
 
 ఎంపీ జితేందర్‌రెడ్డి
 ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమైన పదవులన్నింటినీ కూడా జిల్లాకు ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లాలో లిప్ట్ ఇరిగేషన్ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాకే వలసలు రానున్నాయన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి కూడా ప్రసంగించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ రాజారాం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement