స్థాయి పెంచితే నన్నే తిడుతున్నారు | Sakshi
Sakshi News home page

స్థాయి పెంచితే నన్నే తిడుతున్నారు

Published Fri, Oct 10 2014 1:35 AM

స్థాయి పెంచితే నన్నే తిడుతున్నారు - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘ఒడ్డు పొడుగు ఉన్నోడు కదాని ఎంతో ఎత్తుకు తీసుకుపోతే ఇప్పుడు నన్నే విమర్శించేంత ఎత్తుకు ఎదిగాడు’ అని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఒక నాయకుడు పోతే వందమందిని తయారుచేసుకునే సామర్థ్యం టీడీపీ సొంతమన్నారు. మేయర్‌గా తీగలను గెలిపించేందుకు తాను, టీడీపీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డామో, మొన్న ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడో ఆయనకు తెలియదా? అని బాబు ప్రశ్నించారు. గురువారం తలసాని, తీగల తదితరులు సీఎం కేసీఆర్‌ను కలసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన తరువాత బాబు అందుబాటులో ఉన్న టీ.టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. గ్రేటర్ పార్టీ అధ్యక్షుడిగా కృష్ణయాదవ్‌ను నియమించారు. రాత్రి జూబ్ల్లీహిల్స్‌లోని తన నివాసంలో హైదరాబాద్ జిల్లా నేతలతో మరోసారి  సమావేశమయ్యారు.
 
 తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను  గట్టిగా తిట్టిన తలసానికి ఇప్పుడు అదే కేసీఆర్ ఎందుకు నచ్చినట్టో అని ఎద్దేవా చేశారు. వీళ్లు టీడీపీలో ఏ స్థాయి నుంచి వచ్చారో, ఇప్పుడెలా ఉన్నారో తెలియదా అని ప్రశ్నించారు.  కాగా తమను సీఎం దగ్గరికి వెళతామని తీసుకెళ్లారే తప్ప పార్టీ మారుతామని చెప్పలేదని, అభివృద్ధి పనుల విషయమై సీఎంను కలిశామని సమావేశంలో ప్రకాశ్‌గౌడ్, ధర్మారెడ్డి చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. కాగా టీడీపీని ఆంధ్ర పార్టీగా చెపుతున్న కేసీఆర్ ముందు తన కొడుకు తారక రామారావు పేరు మార్చాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, జి.సాయన్న, కృష్ణారావు, గాంధీ, ఆర్. కృష్ణయ్య, మాజీ మంత్రులు కె. విజయరామారావు, కృష్ణయాదవ్, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సారంగపాణి, నల్లెల్ల కిశోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
 నల్లగొండలో నేడు టీడీపీ బస్సు యాత్ర
 
 ఇదిలాఉండగా, తెలంగాణలో టీడీపీ చేపట్టే బస్సుయాత్ర శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభం కాబోతోంది. పార్టీ టీ.టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఇతర ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొననున్నారు.
 
 టీ అభివృద్ధిపై కేసీఆర్‌కు లోకేశ్ సవాల్
 
 తెలంగాణ అభివృద్ధిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్ ద్వారా సవాల్ విసిరారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై బాబుతో కేసీఆర్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంపై, టీ విద్యుత్ సంక్షోభంపై కేసీఆర్ చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement