చార్మినార్ చెదురుతోంది! | Sakshi
Sakshi News home page

చార్మినార్ చెదురుతోంది!

Published Fri, Dec 26 2014 1:56 AM

చార్మినార్ చెదురుతోంది!

* కట్టడం మూలాల్లోకి చేరుతున్న ప్రమాదకర కలుషితాలు
* ఇప్పటికే పలు చోట్ల పగుళ్లు.. భారీగా దెబ్బతిన్న గోడలు
* సందర్శకుల రాతలు, గీతలు, కాలుష్యమే కారణం
* ఇటీవల గుర్తించిన ఆర్కియాలజీ నిపుణులు
* యుద్ధప్రాతిపదికన సంరక్షణ చర్యలు..
* 25 లక్షల రూపాయలతో పనులు ప్రారంభం
* మొత్తం మరమ్మతులకు రూ. కోటిన్నరకుపైగా వ్యయం

 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కీ షాన్.. మన చార్మినార్! భాగ్యనగరికి అంతర్జాతీయ యవనికపై ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన అపూర్వకట్టడం!! నగరం నడిబొడ్డున ఠీవిగా నిలిచి దేశ, విదేశీ పర్యాటకులను కట్టిపడేస్తున్న కళా వైభవం.. కానీ ఈ చారిత్రక కట్టడానికి ముప్పు వచ్చింది.. అది కూడా చార్మినార్ గోడలపై సందర్శకుల రాతలు, పదునైన వస్తువులతో చెక్కడం మూలంగా.. చుట్టూ వాహనాలు తిరగడం, కాలుష్యం కూడా దీనికితోడై కట్టడం దెబ్బతింటోంది.. ఉపరితలంపైనా తెల్లని వర్ణం గోధుమ రంగులోకి మారిపోతోంది.. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ కాన్పూర్, భారత పురావస్తు సర్వే సంస్థ, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ నిపుణుల బృందం సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చారు. ఇది ఇలాగే కొనసాగితే కట్టడం లోపలి గ్రానైట్ రాళ్లు కదిలి, నిర్మాణ పటుత్వం దెబ్బతింటుందని వారు హెచ్చరించారు కూడా.
 
చార్మినార్ చుట్టూ నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. వాటి పొగ వల్ల కట్టడం మసకబారడం, సాధారణ రసాయన ప్రక్రియతో దాన్ని కొంతవరకు సరిదిద్దటం జరుగుతోంది. నాలుగైదు ఏళ్లకోసారి రసాయన ప్రక్రియతో కట్టడాన్ని శుభ్రం చేస్తున్నారు. కానీ చార్మినార్ సందర్శనకు వచ్చేవారు గోడలపై రాసే పేర్లు, గీతలు, చిత్రాలు గీయడం వంటివాటి వల్ల కలుగుతున్న నష్టంపై పెద్దగా దృష్టి సారించలేదు. చాలామంది తాళం చెవులు, మేకులు వంటి పదునైన వస్తువులతో చార్మినార్ గోడలపై పేర్లు, చిత్రాలు గీస్తున్నారు. ఇలా కొన్నిచోట్ల దాదాపు మూడు సెంటీమీటర్ల లోతు వరకూ కూడా గోడలపై గీతలు పడ్డాయి. దీనితో జరుగుతున్న నష్టమేమిటో ఇటీవల భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం కట్టడంపై దాదాపు 500 చదరపు మీటర్ల మేర ఈ రాతలు, గీతలు ఉన్నట్లు గుర్తించారు.
 
ప్రమాదమేమిటి..?
 వేల సంఖ్యలో వాహనాలు చార్మినార్ చుట్టూ తిరుగుతుండడంతో విషవాయువులతో పాటు మోతాదుకు మించి నైట్రోజన్ డయాక్సైడ్, శ్వాసించగల అతి చిన్న ధూళి కణాలు (రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్స్), నాన్ రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్స్ విడుదల అవుతున్నాయి. క్రమంగా ఇవి కట్టడం గోడలపై పొరలా ఏర్పడి.. వానాకాలంలో తడి తగిలి రసాయన చర్యను కలిగిస్తున్నాయి. దీంతో గోడలపై ప్రమాదకర నాచులాంటిది (మైక్రో విజిటేషన్) పెరిగి గోడల పటుత్వాన్ని దెబ్బతీస్తోంది. వాన నీటితో పాటు, సాధారణ సమయంలో వాతావరణంలోని తేమను కూడా చార్మినార్ గోడలు పీల్చుకుంటున్నాయి.
 
 నిజానికి ఈ కట్టడం పైపూతగా వాడిన సంప్రదాయ పదార్థాలు నీటిని స్వీకరించవు. కానీ సందర్శకుల రాతలు పైపూతను దాదాపుగా దెబ్బతీయడంతో.. ప్రమాదకర నాచు, రసాయనాలు లోపలికి చేరి ప్రధాన రాతి కట్టడాన్ని దెబ్బతీస్తున్నాయి. గ్రానైట్ రాళ్లను కూడా పొడిగా మార్చే శక్తి ఈ రసాయన చర్యలకు ఉంటుందని ఏఎస్‌ఐ నిపుణులు చెబుతున్నారు. భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి దేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం, మహాబలిపురం దేవాలయాల్లోని కొన్ని భాగాలు ఇదే తరహాలో దెబ్బతిన్నాయి. లోపలి భాగంలోని రాళ్లు కదిలి పటుత్వం కోల్పోవడంతో పరిరక్షణ చర్యలు చేపట్టారు.
 
పరిరక్షణ చర్యలు ఇలా..
 చార్మినార్ దెబ్బతింటున్నట్లుగా గుర్తించిన.. ఏఎస్‌ఐ దీనిపై చర్యలకు ఉపక్రమించింది. ఇంతకు ముందు గోడలపై దెబ్బతిన్న చోట్ల మాత్రమే సాధారణంగా పైపూత వేసేవారు. కానీ, ఈ సారి గోడలపై దెబ్బతిన్న చోట్ల, పగుళ్లు వచ్చిన చోట్ల ప్రత్యేక మిశ్రమంతో నింపడంతో పాటు.. మొత్తం చార్మినార్‌పై కొత్తగా పూత వేస్తున్నారు. ఇందులో ముందుగా గోడలను లవణాలు లేని నీటితో, ఆ తర్వాత అమ్మోనియం కలిపిన నీటితో శుభ్రపరుస్తున్నారు.
 
  అనంతరం రాతలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సన్నటి ఇసుక, డంగు సున్నం, కరక్కాయ మిశ్రమం, నల్లబెల్లం నీళ్లు, జనుము నార, పాలరాతి పొడితో తయారు చేసిన మిశ్రమాన్ని అద్ది సరిచేస్తున్నారు. తర్వాత మొత్తంగా గోడలపై ఒక పొరలా పూత వేస్తున్నారు. దాని తర్వాత సిబార్ (సున్నం, కరక్కాయ, బెల్లం, గుడ్డులోని తెల్లసొన, జిగురుతో కూడిన మిశ్రమం)తో పైపూత పూస్తున్నారు. ఈ పూతతో గోడల ఉపరితలం గతంలో లాగా అత్యంత నున్నగా తయారవుతుంది. ఇవన్నీ చార్మినార్ నిర్మాణ సమయంలో వాడిన పద్ధతులే కావడం గమనార్హం. ఏఎస్‌ఐలోని రసాయన విభాగం నిపుణులు కూడా కట్టడం వెలుపలి గోడలపై ఏర్పడ్డ ప్రమాదకర నాచు (మైక్రో విజిటేషన్)ను తొలగించేందుకు బయోసైడ్ ట్రీట్‌మెంట్, ప్రిజర్వేటివ్ కోట్ వేస్తున్నారు. ఈ పనులకు రూ.25 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం మొదటి అంతస్తు, ఈశాన్యం వైపు ఉన్న మినార్‌కు మాత్రమే పరిరక్షణ చర్యలు చేపట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం పనికి రూ. కోటిన్నర ఖర్చవుతుందని అంచనా.
 
‘చార్మినార్’ చుట్టూ కాలుష్యమిలా..
 -    రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ సాధారణ స్థాయి 80. అంతకుమించితే నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం చార్మినార్ వద్ద 110-140గా రికార్డవుతోంది.
 -    ఇక నాన్ రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ సాధారణ స్థాయి 60. కానీ చార్మినార్ వద్ద 90 పాయింట్ల వరకు ఉంటోంది.
 -    నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా సుమారు 20 శాతంగా ఉండాల్సి ఉండగా 25 శాతాన్ని మించుతోంది.
 
చారిత్రక నేపథ్యం..
 -    మహమ్మద్ కులీకుతుబ్‌షా 1591-92లో చార్మినార్‌ను నిర్మించారు. ఇది హైదరాబాద్ ల్యాండ్‌మార్క్‌గా మారింది.
 -    అప్పట్లో హైదరాబాద్‌లో ప్రబలిన ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టాక దానికి గుర్తుగా ఈ కట్టడాన్ని నిర్మించారు.
 -    గ్రానైట్ రాళ్లు, డంగు సున్నంతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణానికి 48.7 మీటర్ల ఎత్తైన నాలుగు మినార్లు ఆకర్షణ. అవి తాజ్‌మహల్‌ను పోలి ఉంటాయి.
 -    పైకి ఎక్కి నగర అందాలను వీక్షించేలా 149 మెట్లను నిర్మించారు. ఎగువన మసీదు, దిగువన భాగ్యలక్ష్మి ఆలయం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి.
 -    చార్మినార్ నిర్మాణానికి అప్పట్లో రూ. లక్ష వరకు ఖర్చయిందని చెబుతారు.
 -    1824లో నైరుతి వైపు ఉన్న మినార్ కుప్పకూలింది. మిగతా కట్టడానికి కూడా కొంత నష్టం వాటిల్లింది. అప్పట్లో  రూ. 60 వేలతో దాన్ని పునర్నిర్మించారు.
 -    1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా పెద్ద గడియారాలను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement