'చీప్' లిక్కర్ | Sakshi
Sakshi News home page

'చీప్' లిక్కర్

Published Mon, Jul 6 2015 6:24 AM

chief liquar will replace gundumba in soon

ఇక సర్కారీ చౌక మద్యం

  • అక్టోబర్ తర్వాతే అమ్మకాలు
  •  క్వార్టర్ 30 రూపాయలే..!
  •  10 వేల జనాభాకు ఓ దుకాణం!
  •  గుడుంబా విక్రయూలు బాగున్నచోటే లెసైన్స్

ఖమ్మం(వైరా):
 రాష్ట్రంలో చౌక మద్యం విక్రయాలపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుడుంబాను తరిమికొట్టాలంటే .. ఆ స్థానంలో చౌక మద్యం అమ్మకాలు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం దీన్ని ఎప్పటి నుంచి అందుబాటులోకి తేవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. అధికార వర్గాల సమాచారం మేరుకు అక్టోబర్ నుంచి కొత్త లెసైన్సు అమల్లోకి వస్తుండటంతో అప్పటి నుంచి చౌక మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 దుకాణాలపై కసరత్తు
 చౌక మద్యం దుకాణాలు ఎక్కడ ఎర్పాటు చేయాలనే అంశంపై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మొదలు ఎక్సైజ్ ఎస్సై వరకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై పలు సూచనలు వచ్చాయి. 10 వేల జనాభాకు ఒక చౌక మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వాలని ఓ ఆలోచన.. లేదంటే రెవెన్యూ, గ్రామ పంచాయతీ యూనిట్‌గా అనుమతి ఇవ్వాలని మరో ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. గుడుంబా విక్రయూలు ఎక్కువగా ఉన్న చోట లెసైన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయూ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే అమ్మకాలు ఎలా ఉంటాయనే అంచనాలు రూపొందించాల్సిందిగా ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యూయి.
 అక్టోబర్ నుంచే చౌకమద్యం
 ఈ ఏడాది మద్యం లెసైన్స్‌దారుల లెసైన్స్ గడువు జూన్ 30కి ముగిసింది. దీన్ని ప్రభుత్వం మరో మూడునెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అక్టోబర్ నెలలో కొత్త లెసైన్సులు, కొత్త మద్యం విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భవి ష్యత్‌లో చౌకమద్యం పై న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కనీసం మూడు నెలల సమయం అవసరం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల సమాచారం మేరకు వైన్స్ షాపుల్లో చౌక మద్యం అమ్మకాలు జరపడానికి వీల్లేదని.. 10 వేల జనాభా ఉన్నచోట మద్యం దుకా ణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 25లక్షల జనా భా ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 149 దుకాణాల స్థా నంలో జనాభాకు అనుగుణంగా  250 మద్యం దుకాణాలు రానున్నాయి.
 రూ.30కే చౌకమద్యం
 ప్రస్తుతం మద్యం దుకాణాల్లో లభిస్తున్న చీప్‌లిక్కర్ ధర రూ.180 ఉండగా ప్రభుత్వం అమ్మే చౌకమద్యం మాత్రం రూ.30 కే లభించనుంది. గుడుంబా ప్యాకెట్ల ధరకు దగ్గరగా ఉండేందుకు ఈ ధరను నిర్ణయిస్తున్నట్లు సమాచారం. మరింత కిక్ ఇచ్చేలా ఆల్కాహాల్ శాతాన్ని పెంచనున్నారు. ఇక రూ.30కే మందుబాబులకు కిక్ ఎక్కేలా లిక్కర్ అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement