పిల్లల సంక్షేమమే ముఖ్యం.. తల్లిదండ్రుల హక్కు కాదు

7 Apr, 2019 03:59 IST|Sakshi

 హైకోర్టు తీర్పు సంరక్షణ బాధ్యతల అప్పగింతలో కోర్టులు జాగ్రత్త వహించాలి

సాక్షి, హైదరాబాద్‌:  భార్యాభర్తల మధ్య స్పర్థలు వచ్చినప్పుడు పిల్లల సంరక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో చూడాల్సింది ఆ పిల్లల సంక్షేమం, ప్రయోజనాలే తప్ప, తల్లిదండ్రుల హక్కులు కాదని హైకోర్టు పునరుద్ఘాటించింది. మైనర్‌ పిల్లల సంక్షేమాన్ని ఆయా కేసులలోని అంశాలు, ఇతర పరిస్థితుల ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాలంది. కుటుంబపెద్దగా, ఆర్జనపరుడుగా ఉంటాడు కాబట్టి పిల్లల సంక్షేమం విషయంలో తండ్రి సరైన వ్యక్తి అని చట్టాలు చెబుతున్నాయంది. పిల్లలను ఎవరి కస్టడీకి అప్పగించాలన్న విషయంలో తల్లిదండ్రుల సంపాదన, ప్రేమ అన్నవి పరిగణనలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలైనప్పటికీ, కేవలం వాటి ఆధారంగానే నిర్ణయం తీసుకవడానికి వీల్లేదని పేర్కొంది. ఇటువంటి సమయాల్లో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తతో న్యాయవిచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, పిల్లాడిని సరిగా చూసుకోకపోవడం, మంచంపై నుంచి చిన్నారిని తోసివేయడం వంటి చర్యలకు పాల్పడిన నేపథ్యం లో ఆ చిన్నారిని తండ్రి సంరక్షణలో ఉం చడం శ్రేయస్కరమని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో తల్లిపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ఈ చిన్నారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని తండ్రి సంరక్షణలో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

ఆ పిల్లాడిని తండ్రి సంరక్షణలోనే ఉంచేం దుకు నిరాకరిస్తూ సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వివాహం తరువాత కూడా భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, 23 నెలల కుమారుడిని సక్రమంగా చూసుకోకపోడంతో ఆ చిన్నారిని తన సంరక్షణకు అప్పగించాలని కోరుతూ ఓ వ్యక్తి సిటీ సివిల్‌ కోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈ అభ్యర్థనను సివిల్‌ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. భార్యపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో ఆ చిన్నారిని పిటిషనర్‌(భర్త) సంరక్షణలోనే ఉంచడం సబబని స్పష్టం చేసింది. సివిల్‌ కోర్టు తీర్పును తప్పుపట్టింది. భార్యపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు, చిన్నారి పట్ల ఆమె ప్రవర్తన, చిన్నారి సంరక్షణ కోరకపోవడం వంటి అంశాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదంది. ఈ కేసులో ఏ రకంగా చూసినా చిన్నారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతని సంరక్షణను పిటిషనర్‌కు ఇవ్వడమే సరైందని హైకోర్టు తీర్పునిచ్చింది. 

మరిన్ని వార్తలు