చిన్నారెడ్డి దీక్ష భగ్నం | Sakshi
Sakshi News home page

చిన్నారెడ్డి దీక్ష భగ్నం

Published Wed, Sep 17 2014 1:52 AM

చిన్నారెడ్డి దీక్ష భగ్నం

వనపర్తి/మహబూబ్‌నగర్ అర్బన్: 
 వనపర్తిని జిల్లాగా ప్రకటించాలని మూడురోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డిని సోమవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్‌చేసి దీక్షను భగ్నంచేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు సోమవారం రాత్రి చిన్నారెడ్డి చేత దీక్షను విరమింపజేసేందుకు తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ దౌత్యం ఫలించలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చొరవతీసుకొని వనపర్తి జిల్లాపై స్పష్టమైన ప్రకటన ఇస్తేనే దీక్ష విరమణపై నిర్ణయం తీసుకుంటానని చిన్నారెడ్డి స్పష్టంచేశారు. సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డిని వైద్యులు పరీక్షించి బీపీ ప్రమాదకరంగా ఉండడాన్ని గుర్తించి బలవంతంగా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అఖిలపక్ష నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోటీసులు లాఠీచార్జికి ప్రయత్నించారు. చిన్నారెడ్డి ఆరోగ్యం కోసమైన తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తిచేశారు. అయినా వినకపోవడంతో పోలీసు బలగాలను మోహరించి చిన్నారెడ్డిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఫ్లూయిడ్స్ ద్వారా చికిత్స అందజేశారు. 
 నిమ్స్‌కు తరలింపు
 ఎస్‌వీఎస్‌లో ఎమ్మెల్యే చిన్నారెడ్డి వైద్యం అందిస్తున్న సమయంలో ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. రక్తంలో షుగర్‌స్థాయి, పల్స్‌రేటు బాగా తగ్గిపోవడంతో పాటు ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యపరిస్థితి విషమిస్తుందని స్థానిక వైద్యులు సూచించారు. త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలని కోరినా వినిపించుకోలేదని ఇక్కడి డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో మరింత మెరుగైనవైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లారని ఎస్‌వీఎస్ ఆస్పత్రి మేనేజ్‌మెంట్ ప్రతినిధి రాంరెడ్డి వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార పదార్థాలను తీసుకోవాలని కొత్వాల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి డీఎల్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు నచ్చజెప్పినప్పటికీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వినిపించుకోలేదు. పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 జిల్లా ప్రకటన వచ్చేవరకూ దీక్ష: 
 చిన్నారెడ్డి
 గత సార్వత్రిక ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వనపర్తిని జిల్లాగా చేస్తామని ప్రకటించడమే కాకుండా ఈ అంశాన్ని ఆ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చారని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఆయన ఇచ్చిన హామీని అమలుచేయాలని, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్తజిల్లాను ప్రకటించాలి. రాస్తారోకో, బంద్‌లు చేపడతామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. 
 
 
 
 
 

Advertisement
Advertisement