25న కేసీఆర్‌ రాక | Sakshi
Sakshi News home page

25న కేసీఆర్‌ రాక

Published Sat, Nov 17 2018 3:37 PM

CM KCR Coming to District on for Election Campaign - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచా లని గులాబీ పార్టీ నిర్ణయించింది. ముఖ్యనేతలతో మొదటి దశ ప్రచారాన్ని పూర్తిచేసిన ఆ పార్టీ.. ఇక అధినేత కేసీఆర్‌ను రంగంలోకి దించుతోంది. ఈ నెల 25న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారభేరీని మోగించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభతో ముందస్తు శంఖా రావం పూరించిన ముఖ్యమంత్రి.. ఈనెల 25న ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. రేపటితో నామినేషన్ల ఘట్టానికి తెర పడుతుండడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు స్టార్‌ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రచారకర్తల జాబితాను కూడా అందజేసిన ఆయా పార్టీలు.. పర్యటనల షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

ఇద్దరు మంత్రులు.. నలుగురు ఎమ్మెల్యేలు 
మహాకూటమి అభ్యర్థులను గెలిపించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది. ముఖ్యంగా తమ పార్టీ పోటీచేస్తున్న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ముఖ్యనేతలను మోహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇద్దరు ఏపీ మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మూడు స్థానాలు టీడీపీ సిట్టింగ్‌ స్థానాలు కావడంతో పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. శివారు నియోజకవర్గాలు కావడం, సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండడం, కాంగ్రెస్‌తో పొత్తు కలిసివస్తుందని అంచనా వేస్తోంది. సమీకరణలన్నీ అనుకూలంగా ఉన్నందున ఈ మూడింటితోపాటు కూకట్‌పల్లిని కూడా దక్కించుకునే విధంగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని తెలుగుదేశం అధిపతి చంద్రబాబునాయుడు సూచించినట్లు తెలిసింది. అంతేగాకుండా.. తాను కూడా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం 

Advertisement
Advertisement