జనసంద్రమైన జోడేఘాట్ | Sakshi
Sakshi News home page

జనసంద్రమైన జోడేఘాట్

Published Thu, Oct 9 2014 3:20 AM

జనసంద్రమైన జోడేఘాట్ - Sakshi

- ఆదివాసీ పోరాట యోధుడు భీమ్‌కు సీఎం కేసీఆర్ ఘన నివాళి
- వేలల్లో తరలివచ్చిన అడవిబిడ్డలు
- సంప్రదాయ పద్ధతిలో పూజలు

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జోడేఘాట్ జనసంద్రమైంది.. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌కు నివాళి అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో పులకించిపోయింది. జల్.. జంగల్.. జమీన్ కోసం నైజాం సర్కార్‌పై అలుపెరుగని పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీల ఆరాధ్యదైవానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ గిరిజనులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కొమురం భీమ్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత మారుమూల ప్రాంతమైన జోడేఘాట్‌కు రావడం పట్ల ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పక్షం రోజులుగా ఏర్పాట్లు, బందోబస్తు చర్యల్లో నిమగ్నమైన జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది.

కొమురం భీమ్ 74వ వర్ధంతి కార్యక్రమం బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. గతేడాది రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక రాష్ట్రంలో ఘనంగా నిర్వహించడంపై ఆదివాసీల్లో ఆనందం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు హెలిక్యాప్టర్‌లో జోడేఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలుత భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొమురం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అంతకు ముందుకు భీమ్ మనువడు కుంరం సోనేరావు కుటుంబీకులతో కలిసి భీం సమాధి వద్ద పూజలు చేసి, కొమురం వంశీయుల జెండాలను ఎగురవేశారు. ఏటా నిర్వహించనున్న గిరిజన దర్బార్‌లో ఈ ఏడాది కేసీఆర్ పాల్గొన్నారు. ఆదివాసీ, గిరిజన సంఘాల నుంచి వినతులు స్వీకరించారు.
 
ఆదివాసీలకు వరాలు..
భీమ్ వర్ధంతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాపై, ఆదివాసీలపై వరాల జల్లు కురిపించారు. ఆదివాసీల మరణాలపై స్పందించిన సీఎం వారి ఆరోగ్య స్థితిగతులు, పౌష్టికాహరం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. పారిశుధ్యం, తాగునీరు విషయంలో క్షేత్ర స్థాయిలో ఉండే సర్పంచులు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే గిరిజన మరణాలను అరికట్టవచ్చని వారి బాధ్యతలను గుర్తు చేశారు. కొమురం భీమ్ తన గుండెల్లో కొలువై ఉన్నారని పేర్కొన్న కేసీఆర్ మహోన్నత పోరాటం చేసిన వ్యక్తికి గత ప్రభుత్వాల్లో సరైన గౌరవం లభించలేదన్నారు. భీమ్ రక్తంతో తడిసిన గడ్డ జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో ఏకపక్షంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎన్నుకున్నందుకు చరిత్రలో కలకాలం నిలిచిపోయోలా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు.

ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు కొమురం భీమ్ పేరును పెడతామని ప్రకటించిన కేసీఆర్ ఇక్కడ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అత్యంత మారుమూల మండలాలైన దహెగాం, బెజ్జూరు వంటి మండలాల్లో సాగునీటి అవసరాలు తీర్చాకే ‘ప్రాణహిత-చేవెళ్ల’ నీటిని ఇతర జిల్లాలకు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలోని విద్యా వైద్యం రంగాల అభివృద్ధికి ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వైద్యాధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల అభివృద్ధికకి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సీఎం ఓఎస్‌డీ, కవి, గాయకుడు దేశిపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోని  పలు ఉద్యమాలకు భీమ్ పోరాటం స్ఫూర్తి నింపిందన్నారు. వలస పాలకులు భీమ్ చరిత్రను గుర్తించలేదని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. వట్టి వాగు ప్రాజెక్టుకు కొట్నాక భీమ్‌రావు పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు గోడం నగేష్, సీతారాంనాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ శోభా సత్యనారాయణగౌడ్, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, ఎమ్మెల్యేలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎన్.దివాకర్‌రావు, నల్లాల ఓదేలు, కోనేరు కోనప్ప, జి.విఠల్‌రెడ్డి, రేఖా శ్యాంనాయక్, దుర్గం చిన్నయ్య, రాథోడ్ బాపూరావు, ఎమ్మెల్సీ వెంకట్‌రావు, టీఆర్‌ఎస్ తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోకభూమారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండా మల్లేష్, ఆత్రం సక్కు, కావేటి సమ్మయ్య, తెలంగాణ  గజిటెడ్ ఆఫీసర్స్  అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్యాంనాయక్, కెరమెరి  జెడ్పీటీసీ అబ్దుల్‌కలాం, ఎంపీపీ మాచర్ల గణేష్, సర్పంచ్ బీము తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ బందోబస్తును పర్యవేక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement