చప్పట్లు కొట్టారు.. దీపాలు వెలిగించారు.. లాక్‌డౌన్‌ మరిచారు  | Sakshi
Sakshi News home page

చప్పట్లు కొట్టారు.. దీపాలు వెలిగించారు.. లాక్‌డౌన్‌ మరిచారు 

Published Tue, Apr 7 2020 1:45 AM

CM KCR Requested Narendra Modi To Extend The Lockdown In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు వారాల క్రితం జనతాకర్ఫ్యూ, రెండు రోజుల క్రితం ఐక్యతకు నిదర్శనంగా దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపునకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. చప్పట్లు చరచడం, దీపాలు వెలిగించడంలో చొరవ చూపిన జనం లాక్‌డౌన్‌ను అమలు చేసే విషయంలో మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పాలు, కూరలు లాంటి అత్యవసరాలు కొనేందుకు రోడ్డెక్కి ఆ తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు. కానీ మరో 25 శాతం మంది లాక్‌డౌన్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా అదేపనిగా రోడ్డెక్కుతున్నారు. కనిపించిన పరిచయస్తులతో కబుర్లు చెబుతూ అకారణంగా జనసమూహాలకు కారణమవుతున్నారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మర్కజ్‌ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఒక్కసారిగా వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న తరుణంలో పరిస్థితి చేయిదాటకుండా లాక్‌డౌన్‌ను అత్యంత పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్నందున, దాన్ని మరికొన్ని వారాలు కొనసాగించాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోదీని కోరారు.

అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉన్న మనదేశానికి కరోనాను నియంత్రించాలంటే లాక్‌డౌన్‌ తప్ప మరో గత్యంతరం లేదని సీఎం స్పష్టంగా చెబుతోన్న సమయంలో, బాధ్యత లేని కొంతమంది లాక్‌డౌన్‌ను బేఖాతరు చేస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల పెను విపత్తుకు అవకాశం కలిగే ప్రమాదం ఉంటుందన్న హెచ్చరికలను వీరే మాత్రం పట్టించుకోవటం లేదు. లాక్‌డౌన్‌ విధించిన తొలిరోజు జనం ఇలాగే రోడ్లపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే కనిపించడంతో అప్పట్లో ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. వెంటనే మన పోలీసు శాఖ స్పందించి కట్టడి చేసింది. దీంతో కొన్ని రోజుల పాటు పరిస్థితి అదుపులో ఉంది. కానీ మళ్లీ కొన్ని ప్రాంతాల్లో అదుపు తప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో క్రమంగా పరిస్థితి మెరుగవుతోన్న తరుణంలో హైదరాబాద్‌లోని యావత్తు పాతనగరం సహా యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, చింతల్‌ బస్తీ, ముషీరాబాద్, జమిస్తాన్‌పూర్, మెహిదీపట్నం, నార్సింగి... ఇలా పలు ప్రాంతాల్లో జనం విచ్చలవిడిగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల సూచనలు.. 
కూరగాయలు అమ్మేవారిపై ఆంక్షలు లేవు. ఫలితంగా సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది విక్రేతలు కాలనీలు, మార్కెట్ల లో కూరగాయలు అమ్ముతున్నారు. కాలనీల్లో కూరలమ్మే వారి మధ్య కనీస దూరం ఉండేలా చూడాలి. ప్రజలు కూడా వందల సంఖ్యలో మార్కెట్లకు చేరుతున్నారు. అలా రాకుండా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లకు సాధారణ ప్రజలను అనుమతించొద్దు.  
♦ లాక్‌డౌన్‌ అమలులోకి రాగానే పోలీసు సిబ్బంది దుకాణాల వద్ద మీటరు దూరం చొప్పున నేలపై వృత్తాకారంలో గీతలు గీయించారు. ఒక్కో కొనుగోలుదారు ఆ వృత్తంలో ఉంటూ ముందుకు సాగి వస్తువులు కొనాలి. కానీ అది ఇప్పుడు అమలవ్వడం లేదు. జనం ఆ వృత్తాల్లోనే ఉండేలా చూసే బాధ్యతను దుకాణదారులకే అప్పగించాలి. ఎక్కడైనా గుంపుగా ఉంటే దుకాణదారులపై చర్యలు తీసుకోవాలి. 
♦ మైకుల ద్వారా పోలీసులు హెచ్చరిస్తూ పహారాగా తిరుగుతుంటే జనంలో మార్పు వస్తుంది. అవసరమైతే గుంపులుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల యువకులు రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నారు. అలాంటి వారి వాహనాలను జప్తు చేయాలి. అవసరమైతే లైసెన్సు కూడా రద్దు చేయాలి.  
♦ దుకాణాలు తెరిచి ఉన్నంత సేపు జన సంచారం ఉంటోంది. అందుకే దుకాణాలను సాయంత్రం 6 వరకు కాకుండా మధ్యాహ్నమే మూతపడేలా చూడాలి. మందుల షాపులు మాత్రమే ఉండేలా చూడాలి.  
♦ చాలా చోట్ల కేఫ్‌ల షట్టర్లు మూసి లోపల టీ తయారు చేసి ఫ్లాస్కోల ద్వారా బయట అమ్ముతున్నారు. పాన్‌షాపులదీ ఇదే తీరు. ఇలా అక్రమంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే అవి మూతపడతాయి.

ఇది హైదరాబాద్‌ పాత నగరంలోని జహనుమా రోడ్డుపై సోమవారం ఉన్న పరిస్థితి. లాక్‌డౌన్‌ అమలవుతోన్న తరుణంలో జనం ఇలా బాధ్యతారహితంగా రోడ్డెక్కారు. కరోనా బాధితుల సంఖ్య పాత నగరంలో పెరుగుతోన్న తరుణంలో అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ ఇలా అపహాస్యం పాలవుతోంది.

Advertisement
Advertisement