పెద్ద పంచాయతీలు పరోక్షం! | Sakshi
Sakshi News home page

పెద్ద పంచాయతీలు పరోక్షం!

Published Tue, Mar 27 2018 2:03 AM

Cm KCR Review on Panchayat Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త పంచాయతీ చట్టంపై చివరి నిమిషంలో ప్రతిష్టంభన నెలకొంది. బడ్జెట్‌ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించి.. పంచాయతీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభు త్వం తుదిఏర్పాట్లు చేస్తున్న విషయం తెలి సిందే. ప్రస్తుత చట్టంలో దాదాపు 15 సవరణలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒకటీరెండు కీలకమైన అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించాలా.. ప్రత్యక్షంగా నిర్వహించాలా.. అనే విషయంలోనే పీటముడి పడిం దని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా పంచాయతీరాజ్‌ శాఖ బిల్లు తయారు చేసింది. ఈ బిల్లుకు న్యాయశాఖ తుది మెరుగులు దిద్దింది. కాని చివరి నిమిషంలో పంచాయతీ ఎన్నికలకు రెండు పద్ధతులను అనుసరిద్దామని సీఎం కేసీఆర్‌ కొత్త ప్రతిపాదనను సూచించినట్లు తెలిసింది. దీని ప్రకారం రాష్ట్రంలో పంచాయతీలను రెండుగా వర్గీకరించి.. కొన్నింటికి ప్రత్యక్ష ఎన్నికలు, కొన్నింటికి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. మూడు వేలకు మించి జనాభా ఉన్న మేజర్‌ గ్రామాలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాలకు ప్రత్యక్షంగా ఎన్నిక జరుపుతారు. ప్రస్తు తం పంచాయతీ ఎన్నికలు పార్టీగుర్తు లేకుండానే జరుగుతున్నాయి. కానీ, ప్రత్యక్ష ఎన్నిక జరిగే చోట పార్టీ గుర్తులతోనే ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేస్తారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో ఈ విధానం అమల్లో ఉంది. కొత్త ప్రతిపాదన మేరకు బిల్లును ప్రవేశపెడతారా? ఇప్పుడు న్న ప్రత్యక్ష పద్ధతినే కొనసాగిస్తారా? అనేది సీఎం నిర్ణయంపై ఆధారపడి ఉంది. 

ఎంపీపీ ఎన్నికకు కీలక సవరణ 
మండల పరిషత్‌లలో అధ్యక్షుని ఎన్నిక విషయంలోనూ కొత్త చట్టంలో కీలక సవరణ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఎంపీపీ సీటు ఎస్సీ లేదా ఎస్టీలకు రిజర్వైతే.. సంబంధిత ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో గెలిచిన ఎంపీటీసీ సభ్యులు మాత్రమే పోటీ చేసేందుకు అర్హులయ్యే వారు. కొత్త సవరణ ప్రకారం జనరల్‌ స్థానాల్లో గెలిచిన ఎస్సీలు, ఎస్టీలు కూడా ఎంపీపీలుగా పోటీ చేసేందుకు అర్హులుగా పరిగణిస్తారు. 

నాలుగు బిల్లుల రూపకల్పన 
అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను ఆమోదించేందుకు జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం కేబినెట్‌ భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బిల్లులపై చర్చించి ఆమోదిస్తారు. ప్రధానంగా నాలుగు బిల్లులను సభ ముందుంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్ట సవరణతోపాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కమిటీలకు చట్ట బద్ధత కల్పించే సవరణ బిల్లులను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అదే రోజున సభలో బిల్లులను ప్రవేశపెడతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement