జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ మెట్రో పరుగులు 

8 Feb, 2020 02:55 IST|Sakshi

ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోలో ప్రయాణం 

ఈ మార్గంలో 13 నిమిషాల్లో జర్నీ పూర్తి 

నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ వాసుల కలల మెట్రో రైల్‌ను జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జేబీఎస్‌ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వరకు మెట్రో రైల్‌లో ప్రయాణం చేశారు. సీఎం ప్రయాణించడంతో ఈ మార్గంలోని చిక్కడపల్లి మినహా ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా రైలును నిలపకుండా నేరుగా ఎంజీబీఎస్‌ వరకు నడిపారు. దీంతో 13 నిమిషాల్లోనే జర్నీ పూర్తయ్యింది. సాధారణంగా ఈ మార్గంలో మిగతా ప్రతీ స్టేషన్‌లో మెట్రో రైల్‌ నిలిపితే ప్రయాణానికి 16 నిమిషాల సమ యం పడుతుంది. ఎంజీబీఎస్‌ వద్ద మెట్రో దిగిన సీఎం స్టేషన్‌ లో ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎల్‌అండ్‌టీ, హెచ్‌ ఎంఆర్‌ అధికారులు నగర మెట్రో ప్రాజెక్టు విశేషాలను కేసీఆర్‌కు వివరించారు. మెట్రో ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఈఓ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ ఎండీ కేవీబీ రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు.

నేడు ఉదయం 6–30 నుంచి అందుబాటులోకి..
జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గంలో శనివారం ఉదయం 6–30 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం ఈ మార్గంలో సుమారు 60 వేల నుంచి లక్ష మంది వరకు జర్నీ చేసే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాగా, మెట్రో ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకావడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ కనిపించింది. జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు భారీగా చేరుకున్న నాయకులు, కార్యకర్తలు బ్యాండ్‌ మేళాలు, నృత్యాలతో సందడి చేశారు. చిక్కడపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద కొన్ని నిమిషాల పాటు రైల్‌ నిలపడంతో కేసీఆర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి సీఎం అభివాదం చేశారు.  

మెట్రో విస్తరణకు ప్లాన్‌ సిద్ధం చేయండి...
నగరం నలుమూలలా మెట్రో విస్తరణకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మెట్రోలో ప్రయాణిస్తూ ఆయన.. ఎన్వీఎస్‌ రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. నగరవాసులకు కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీ లేకుండా ప్రయాణం సాగించేందుకు, హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు మెట్రో ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు మార్గాల్లో మెట్రో పూర్తితో ఆ ఫలాలను నగరవాసులు అందిపుచ్చుకున్నారని సీఎం అన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్లు అత్యాధునిక ఎయిర్‌ పోర్టుల తరహాలో కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ, విజన్‌పరంగా ఢిల్లీ మెట్రో కంటే హైదరాబాద్‌ మెట్రో మరింత అత్యాధునికంగా ఉందన్నారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఆ మార్గంలోని ప్రతి ప్రాంతాల విశిష్టతలను ముఖ్యమంత్రి గుర్తు చేసినట్లు హెచ్‌ఎమ్‌ఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా