వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష | Sakshi
Sakshi News home page

వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Published Tue, Sep 9 2014 2:14 AM

వరదలపై  సీఎం కేసీఆర్ సమీక్ష - Sakshi

హైదరాబాద్:  గోదావరికి వరద పోటెత్తి పలు ప్రాంతాలు జలమయం కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో, ఇతర ఉన్నతాధికారులతో కలసి సమీక్షించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగినందున ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబర్తితో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాచలం డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని సింహభాగం ప్రాంతాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందని తెలిసి ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

అవి ఆంధ్రప్రదేశ్‌లో కలసినప్పటికీ మానవతాదృక్ఫథంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్త చూపరాదని, ముంపుప్రాంతాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని కూడా అధికారులనడిగి తెలుసుకుని అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించారు.
 
 

Advertisement
Advertisement