సీఎం టూర్ ఆలస్యం | Sakshi
Sakshi News home page

సీఎం టూర్ ఆలస్యం

Published Thu, Feb 5 2015 4:59 AM

CM Tour delay


 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా పర్యటన మరికొన్ని రోజులు వాయిదా పడింది. నెలరోజులుగా ఊరిస్తున్న కేసీఆర్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వెంటనే పర్యటన వాయిదాపడటం ఆనవాయితీగా మారింది. తొలుత జనవరి 22వ తేదీన, తరువాత గత నెల చివరివారంలో సీఎం పర్యటన ఉంటుందని అందరూ భావించారు. పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తి చేశారు. ఆసరా పింఛన్లు, అర్హుల గుర్తింపు, పట్టాలు, నివాసస్థలాలు, మురికివాడల శుభ్రం ఇలా..పనులన్నీ చక్కబెట్టారు.

మణుగూరు విద్యుత్‌ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేశారు. సీఎం జిల్లాకు రావాల్సిన సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరకు వెళ్లాల్సి రావడం, స్వైన్‌ఫ్లూ వ్యాప్తి, డెప్యూటీ సీఎం మార్పు ఇలా ఒకదానికి తర్వాత ఒకటి చోటుచేసుకోవడంతో సీఎం బాగా బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. జనవరి 29న జిల్లాకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం త్వరలో సీఎం పర్యటన ఉంటుందని ప్రకటించారు. ప్రగతి నివేదికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.

సీఎంకు రాష్ట్రస్థాయిలో సమీక్షలు, ఢిల్లీ పర్యటన ఉండటంతో ఈనెల మూడోవారం వరకు ఆయన జిల్లాకు వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండోవారంలో కాస్త వెసులుబాటు దొరికినా కేంద్ర బడ్జెట్ సమావేశాలపై పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా సీఎం పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
 
సీఎం పర్యటన రెండో వారం తర్వాతే: జలగం వెంకట్రావు
‘ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి రెండోవారంలోపు వచ్చే అవకాశం లేదు’ అని పార్లమెంటరీ కార్యదర్శి, సీఎంఓ ఇన్‌చార్జి జలగం వెంకట్రావు తెలిపారు.
 కొత్తగూడెంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు కాలేదన్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఈనెలలో ఖరారయ్యే అవకాశం ఉందని, అయితే ఏ తేదీల్లో పర్యటిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement