ఇళ్ల స్థలాల పేరుతో వసూళ్లు | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల పేరుతో వసూళ్లు

Published Sun, Jul 20 2014 12:44 AM

ఇళ్ల స్థలాల పేరుతో వసూళ్లు

  • పోలీసుల అదుపులో నిందితుడు
  • రాంగోపాల్‌పేట్: ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేస్తున్న కేటుగాడిని స్థానికుల చొరవతో తహసీల్దార్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి కథనం ప్రకారం... తిరుమలగిరికి చెందిన సంపత్‌కుమార్(42) ఎంజీరోడ్‌లోని బుద్ధభవన్ మొదటి అంతస్తులో మూడు నెలల క్రితం తెలంగాణ శ్రామిక సంఘాల సమాఖ్య పేరుతో సంస్థను ప్రారంభించారు.

    పత్రికల్లో ప్రకటనలు, కొంత మంది యువకుల ద్వారా కొత్త ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం ఇప్పిస్తామని బస్తీల్లో ప్రచారం చేయించాడు. దీంతో బన్సీలాల్‌పేట్, చాచానెహ్రూనగర్, రామస్వామి కాంపౌండ్ తదితర బస్తీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కార్యాలయానికి వస్తున్నారు. వారి నుంచి సభ్యత్వం పేరుతో రూ.200, దరఖాస్తు పేరుతో రూ.50 వసూళ్లు చేస్తున్నారు.

    నెల రోజుల తర్వాత రూ.1000 చెల్లించాలని, ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని నమ్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బన్సీలాల్‌పేట్‌కు చెందిన స్థానిక నాయకులు దేశపాక శ్రీనివాస్, నాగభూషణం తదితరులు సదరు కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్టు తేలింది. ఈ విషయాన్ని శనివారం సికింద్రాబాద్ తహసీల్దార్ విష్ణుసాగర్ దృష్టికి తీసుకుని వెళ్లగా ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులు అందించడం లేదని చెప్పారు.  

    వెంటనే ఆయన బుద్దభవన్‌కు వెళ్లి ఇంటి స్థలాల దరఖాస్తుల పేరుతో డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా... తాను ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని చెప్పాడు.  దీంతో తహసీల్దార్ నిందితుడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఇలా సుమారు 8 వేల మంది దగ్గర రూ.20 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపారు.
     

Advertisement
Advertisement