మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక కృషి | Sakshi
Sakshi News home page

మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక కృషి

Published Tue, Apr 17 2018 1:23 PM

Collector Amrapali Meeting In Maternity hospital - Sakshi

కరీమాబాద్‌: వరంగల్‌ అండర్‌ రైల్వేగేట్‌లోని సీకేఎం అనుబంధ ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి అన్నారు. సోమవారం ఆస్పత్రిలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది, ఓపీ, వైద్య సేవలు, సౌకర్యాల గురించి కలెక్టర్‌ తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతివారం ఆసుపత్రిలో డెలివరీస్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఇంకా కావల్సిన సౌకార్యలపై ఎస్టిమేషన్‌ వేయించి ఇవ్వాలని కలెక్టర్‌ కోరారు.

డీఎంహెచ్‌ఓ హరీష్‌రాజ్‌ మాట్లాడుతూ ఉర్సు ఆసుపత్రికి చెందిన డాక్టర్లు సీకేఎంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులను ఉర్సు ఆసుపత్రికి రప్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి గురువారం డెలివరీలు, బుధవారం వ్యాక్సినేషన్, శుక్రవారం స్కానింగ్, శనివారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్, వార్డు రూమ్, పరిసరాలను కలెక్టర్, అధికారులు పరిశీలించారు. సమావేశంలో సీకేఎం సూపరింటెండెంట్‌ రాజేంద్రప్రసాద్, ఆర్‌ఎంఓ శివకుమార్, టీబీ ఆఫీసర్‌ డాక్టర్‌ మల్లిఖార్జున్, రిటైర్డ్‌ జేడీ సూర్యప్రకాష్, కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి రమణమూర్తి, డీఐఓ గీతాలక్ష్మి, డాక్టర్‌ గోపాల్, దేవదాస్, ప్రకాష్‌  పాల్గొన్నారు.

కరీమాబాద్‌: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అమ్రపాలి
బాలల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

కాజీపేట అర్బన్‌: బాలల సంరక్షణకు బాలల స్వచ్ఛంధ సంస్థలు మొదటి ప్రాధాన్యతనివ్వాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం మహిళాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, స్వచ్ఛంధ సంస్థల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలల సంరక్షణ సంస్థలు బాలలకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్ధాయి పర్యవేక్షణ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యులుగా డీసీపీఓ, సీడబ్లుసీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి వైధ్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులను ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ బాలల సంరక్షణ స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement