వారసత్వం పేరుతో నియామకాలా? | Sakshi
Sakshi News home page

వారసత్వం పేరుతో నియామకాలా?

Published Fri, Feb 10 2017 2:19 AM

వారసత్వం పేరుతో నియామకాలా? - Sakshi

ఏకమొత్తంగా ఉద్యోగాలు ఎంత మాత్రం సరికాదు
సింగరేణిలో 30 వేల పోస్టులపై ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలు
ప్రభుత్వానికి, సింగరేణి కాలరీస్‌కు నోటీసులు
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: అనారోగ్య సమస్యలతో విధుల్లో కొనసాగేందుకు అనర్హులని తేలినప్పుడు ఆ ఉద్యోగి వారసులకు ఉద్యోగం కల్పించవచ్చే తప్ప ఉద్యోగుల వారసులందరికీ ఏకమొత్తంగా ఉద్యోగాలు ఇస్తామనడం ఎంతమాత్రం సరికాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. వారసత్వం పేరుతో హోల్‌సేల్‌ ఆఫర్‌ ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సింగరేణిలో 30 వేలకుపైగా పోస్టులను వారసత్వ విధానం ద్వారా భర్తీ చేసేందుకు ఉద్దేశించిన పథకానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సింగరేణి కాలరీస్‌ అధికారులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామ సుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కె.సతీశ్‌ కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై  గురువారం జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ వారసత్వ ఉద్యోగాల పథకం పేరుతో 30 వేల పోస్టులను భర్తీ చేసేందుకు సింగరేణి కాలరీస్‌ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారని, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు హోల్‌సేల్‌గా ఉద్యోగాలు ఇవ్వనున్నారని వివరించారు.

ఈ భర్తీ ప్రక్రియను గోప్యంగా ఉంచారని తెలిపారు. దీని వల్ల నిరుద్యోగులు నష్టపోతారన్నారు. అందువల్ల నియామక ప్రక్రియలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని కోరారు. అయితే అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదిస్తూ ఈ నియామకాలను ఇతర ఉద్యోగాలతో పోల్చలేమన్నారు. పదవీ విరమణకు రెండేళ్లు ఉన్న సమయంలో అనారోగ్య కారణాలతో వైదొలిగే కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. వారు సుమారు 400 మీటర్ల లోతున పనిచేసే కార్మికులని తెలిపారు. వీరి నియామకానికి ఎటువంటి అర్హతలు అవసరం లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ వారసత్వ ఉద్యోగాల పేరుతో హోల్‌సేల్‌ నియామకాలు చేపట్టడానికి వీల్లేదని అభిప్రాయపడుతూ కౌంటర్ల దాఖలుకు ప్రభుత్వాన్ని, సింగరేణి కాలరీస్‌ అధికారులను ఆదేశించింది.

Advertisement
Advertisement