డ్రగ్స్‌ మహమ్మారి సామాజిక రుగ్మత | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మహమ్మారి సామాజిక రుగ్మత

Published Mon, Jul 24 2017 12:55 AM

డ్రగ్స్‌ మహమ్మారి సామాజిక రుగ్మత - Sakshi

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌
హైదరాబాద్‌: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్‌ వినియోగం ఓ సామాజిక రుగ్మతగా మారిందని, దీనిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి పోరాడాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ అన్నారు. ఇటీవల నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారంలో ఏ ఒక్క వర్గాన్నికానీ, వ్యక్తినికానీ లక్ష్యంగా చేసుకోలేదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ(టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌ ‘డ్రగ్‌ క్యాపిటల్‌’గా మారిందని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్‌ వాడకందారులు, సరఫరాదారులు, రవాణాదారులు సహ డ్రగ్స్‌తో సంబంధం కలిగిన ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ దందాపై విచారణ చేస్తున్న అకున్‌ సబర్వాల్‌ అత్యంత సమర్థమైన అధికారి అని ప్రశంసించారు. అనంతరం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టీసీఈఐ నిర్వహించిన మోటార్‌బైక్‌ ర్యాలీని ఆయన జెండా ఉపి ప్రారంభించారు.

సంస్థ కార్యదర్శి టీఎస్‌ ఠాకూర్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలోని వివిధ విభాగాల సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించేందుకు టీసీఈఐ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25న హైటెక్స్‌లో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖులు సహ పలువురు సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగం దేశవ్యాప్తంగా ప్రతిఏటా 20 శాతం వృద్ధి సాధిస్తోందని, దేశవ్యాప్తంగా 2017లో రూ.6,500 కోట్ల వ్యాపారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది దాదాపు రూ. 600 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement