పరిహారం కొన్ని పంటలకే | Sakshi
Sakshi News home page

పరిహారం కొన్ని పంటలకే

Published Sat, May 24 2014 11:52 PM

Compensate for only some crops

 జహీరాబాద్, న్యూస్‌లైన్:  ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. నిండా అప్పుల్లో మునిగి పోయారు. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన అధిక వర్గాలు, పైలిన్ తుపాను కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడులు పడిపోయాయి. ఇది మరచిపోకముందే మార్చినెల మొదటి వారంలో కురిసిన భారీ వడగళ్ల వర్ష బీభత్సానికి పంటలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు.

 దెబ్బతీసిన వడగళ్ల వాన
 జహీరాబాద్, కోహీర్ మండలాల్లో వడగళ్ల బీభత్సానికి అరటి, కంది, మొక్కజొన్న, జొన్న, గోధుమ, శనగ పంటలు దెబ్బతిన్నాయి. జరిగిన పంట నష్టాన్ని అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. అయినా ఇంతవరకూ పంట నష్టం పరిహారం మంజూరుకాక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పత్తి పంటకు మాత్రం పరిహారం చెల్లించే అవకాశం లేదని వారు వెల్లడిస్తున్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు మాత్రం త్వరలోనే పరిహారం మంజూరు కానుందని వారంటున్నారు.

 దీంతో వడగళ్లవాన బాధిత రైతులంతా పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.  వడగళ్ల వర్షానికి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో అరటి పంట సుమారు వేయి ఎకరాలకు పైగానే దెబ్బతింది. సుమారు 400 ఎకరాల్లో కంది పంట, 800 ఎకరాల్లో శనగ, 270 ఎకరాల్లో మొక్కజొన్న, 1,200 ఎకరాల్లో జొన్న, 200 ఎకరాల్లో గోదుమ పంటలు దెబ్బతిన్నాయి. అరటి రైతులు సైతం భారీగా నష్టాలను చవి చూశారు. భారీ పెట్టుబడులతో అరటిసాగు చేపట్టిన రైతులు వడగళ్ల వానతో ఎకరాకు రూ.50 వేల మేర నష్టపోయారు. ఆ సమయంలో నివేదికలు తయారు చేసి ఆదుకుంటామన్న అధికారులు ఇంతవరకూ పరిహారం మంజూరు చేయకపోవడంతో రైతులంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

 ’పైలిన్’తో పత్తికి తీవ్రనష్టం
 గత సంవత్సరం కురిసిన అధిక వర్షాలతో పాటు అక్టోబర్ మాసంలో వచ్చిన పైలిన్ తుపాన్ కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. కొంత మేర ఆశాజనకంగా కనిపించిన పత్తి పంటపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పైలిన్ తుపాన్ వారి ఆశలపై నీళ్లు పోసింది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్ మండలాల్లో 12,927 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేసుకున్నారు. ఎకరా పత్తి పంట సాగు కోసం సుమారు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేయగా, పైలిన్ తుపాను ప్రభావంతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు.  

 ఇక లోతట్టు ప్రాంతాల్లో పత్తిసాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా పత్తిరైతు ఆదుకోవడంలో మెలిక పెట్టింది. చేతికి అందివచ్చిన పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ అప్పట్లో నిబంధన విధించడంతో పత్తి రైతులు దిగ్భ్రాంతికి చెందారు. అక ఇప్పుడేమో పత్తి రైతులెవరికీ పరిహారం ఇవ్వమంటూ తేల్చిచెబుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడుతున్న సర్కార్ తమను ఆదుకోవాలని  వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement