ఎమ్మెల్యే సారూ.. మీరైనా ఆదుకోరూ! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సారూ.. మీరైనా ఆదుకోరూ!

Published Sun, Jun 22 2014 11:55 PM

ఎమ్మెల్యే సారూ.. మీరైనా ఆదుకోరూ! - Sakshi

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో చేపట్టిన రోడ్ల వెడల్పు పనుల్లో నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నిర్మాణాలను కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే ఫైల్‌కు ఇప్పటికీ మోక్షం లభించడం లేదు. రోడ్డు వెడల్పు పనుల్లో ఖాళీ స్థలాలు, భవన నిర్మాణాలను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేందుకు సబ్ కలెక్టర్ ఖాతాలో ఆర్‌అండ్‌బీ శాఖ దాదాపు రూ.10.73 కోట్లు జమచేసింది. ఈ డబ్బులు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
 
పరిహారం డబ్బులు సబ్ కలెక్టర్ ఖాతాలో మూల్గుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిహారం అందడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 2006 జనవరిలో అప్పటి ఇన్‌చార్జి ఆర్డీవో రాంగోపాల్‌రావు ఆధ్వర్యంలో అనంతగిరి రైల్వే గేటు నుంచి ఆలంపల్లి చివరి వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. మొదట 100 అడుగుల మేర  రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికి స్థానిక  నేతలు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మాజీ మంత్రి సబితారెడ్డి చొరవతో చివరకు 80 అడుగుల మేరకు రోడ్డు వెడల్పు చేశారు. ఈ పనుల్లో 300 మందికిపైగానే తమ భవన నిర్మాణాలను, ఖాళీ స్థలాలను కోల్పోయారు. 12,508 చదరపు అడుగుల మేర 264 మంది తమ నిర్మాణాలను నష్టపోయారని అధికారులు గుర్తించారు. 2008 నవంబర్ 26న భూసేకరణకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రోడ్డు వెడల్పు పనుల్లో నష్టపోయిన వారి నుంచి అభ్యంతరాలను సేకరించిన అధికారులు విడుదల చేసిన డ్రాప్ట్ డిక్లరేషన్‌లో తప్పులు దొర్లాయంటూ పలువురు బాధితులు అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
 
వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని స్థానిక ఆర్డీవోకు ఆయన ఆదేశించారు. ఈ మేరకు 2009లో అధికారులు పలువురి నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇదిలా ఉండగా.. రోడ్డు వెడల్పు పనుల్లో నష్టపోయిన 264 మంది బాధితులకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.10 కోట్ల,72 లక్షల,93 వేలను ఆర్డీవో ఖాతాలో జమచేశారు. ఎవరెవరు ఎంతెంత నష్టపోయారు.. ఏ రేటు ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన తర్వాత నష్టపోయిన మేర పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అధికారులు ఈ నిర్ణయం తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ  ఇప్పటి వరకు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
మీరే న్యాయం చేయాలి..
రోడ్డు వెడల్పు పనుల్లో తమ ఇళ్లను, దుకాణాలను కోల్పోయినప్పటికీ అప్పట్లో అధికారులు తయారు చేసిన నష్ట పరిహారం చెల్లించే జాబితాలో తమ వివరాలను పేర్కొనలేదని 190, 191, 203, 204, 206, 207, 210, 435, 436 సర్వేనంబర్లకు సంబంధించిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి రైల్వేగేటు నుంచి సినిమాక్స్ వరకు కాకుండా ఆలంపల్లి చివరి వరకు కొనసాగించిన రోడ్డు వెడల్పు పనుల్లో నిర్మాణాలను కోల్పోయిన ప్రతి బాధితుడికీ నష్ట పరిహారం అందేలా కొత్తగా ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందించే విషయంలో గతంలో ఏ ప్రజాప్రతినిధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదని.. అధికారులు సైతం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement