లక్ష దరఖాస్తుల పరిశీలన పూర్తి | Sakshi
Sakshi News home page

లక్ష దరఖాస్తుల పరిశీలన పూర్తి

Published Thu, Oct 23 2014 4:45 AM

Complete applications are being reviewed

హన్మకొండ అర్బన్ : రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.వెయ్యికి, వికలాంగుల పింఛన్లను రూ. 500 నుంచి రూ.1500కు పెంచిన విషయం విదితమే. ఈ మేరకు కొత్తగా ఆహార భద్రత కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం 10,24,000 దరఖాస్తులు రాగా, పింఛన ్లకోసం 5.25ల క్షల దరఖాస్తులు అందాయి. అయితే, వీటిలో ప్రభుత్వం పింఛన్ల మంజూరుకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం దీన్ని నవంబర్ 2వ తేదీలోగా పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి సూచించింది. అంతేకాకుండా నవంబర్ 7వ తేదీన అర్హుల జాబితా రూపొందించి, 8న గ్రామ, మండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేయాలని నిర్ణయించారు. కాగా, బుధవారం నాటికి సుమారు లక్ష వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు అధికారిక వర్గాల సమాచారం.
 
400 మందితో పరిశీలన..

తొలుత పింఛన్ల కోసం అందిన దరఖాస్తులనే పరిశీలించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 5.25లక్షల దరఖాస్తులు అందగా అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపడుతున్నారు. దీనికోసం ఒక్కో మండలానికి ఆరుగురు ఆధికారులను నియమించగా.. వారిపై మండలస్థా యి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 400మంది అధికారులు, ఉద్యోగులను పరిశీలన కోసం నియమించారు. అం తేకాకుండా నవంబర్ 8వ తేదీన పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆహార భద్రత కార్డుల కోసం వచ్చి న దరఖాస్తుల పరిశీలనపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, ఒకే ఇంటి నుంచి ఆహార భద్రత, పింఛన్ కోసం దరఖాస్తు అందితే మాత్రం రెండింటి పరిశీలన పూర్తి చేస్తున్నారు.
 
ఆశించిన దానికన్నా తక్కువే..

జిల్లావ్యాప్తంగా గతంలో 4.92ల క్షల సామాజిక భద్రతా పింఛన్లు అన్ని రకాలవి ఉన్నాయి. వీటితో పాటు మరో 40వేల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, కొత్తగా పింఛన్ల కోసం 7లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా, 5.25లక్షల దరఖాస్తులే రావడం గమనార్హం. ఇక కుటుంబానికి ఒకే వృద్ధాప్య పింఛన్ అన్న ప్రభుత్వ నిర్ణయంతో పాటు వివిధ కారణాలతో దరఖాస్తుల్లో 25శాతం తిరస్కరణకు గురవుతాయని భావిస్తున్నారు.

అంటే గతంతో పోలిస్తే పింఛన్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. కాగా, ప్రస్తుతం నవంబర్ నుంచే పెరిగిన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నవంబర్ 8వ తేదీ నాటికి ప్రొసీడింగ్‌‌సను సిద్ధం చేయడం ఇబ్బందేనని అధికారులు భావిస్తుండగా... నవంబర్‌లో ఇవ్వాల్సిన పింఛన్‌ను కూడా డిసెంబర్ పింఛన్‌తో కలిపి ఇచ్చే అవకాశముందని సమాచారం.
 

Advertisement
Advertisement