నల్లగొండకు అత్యధికం...  వరంగల్‌ అర్బన్‌కు అత్యల్పం  | Sakshi
Sakshi News home page

నల్లగొండకు అత్యధికం...  వరంగల్‌ అర్బన్‌కు అత్యల్పం 

Published Fri, Jan 25 2019 12:44 AM

Complete distribution of revenue staff to new districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ సిబ్బంది కేటాయింపుపై స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) అవసరమైన రెవెన్యూ సిబ్బందిని నిర్ధారిస్తూ సర్క్యులర్‌ విడుదలైంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్, సర్వే సెటిల్‌మెంట్స్‌ కమిషనర్‌ కార్యాలయాలకు ఈ సర్క్యులర్‌ ఇప్పటికే చేరింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, మండల కార్యాలయాల్లో కలిపి మొత్తం 9,891 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వో), డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో), అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు/తహశీల్దార్లు, సీనియర్‌ స్టెనోగ్రాఫర్స్, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోగ్రాఫర్స్, రికార్డ్‌ అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్‌మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 482 మందిని కేటాయించగా, అత్యల్పంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు 200 మందిని కేటాయించారు. ఇక హైదరాబాద్‌కు 289 మందిని కేటాయించారు. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు 2016లో ఇచ్చిన జీవో నంబర్‌ 157 ద్వారా మంజూరు చేసిన 284 పోస్టులను కూడా ఇందులో కలిపినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది పంపిణీపై కలెక్టర్లు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. 

జిల్లాకో డీఆర్వో: రాష్ట్రంలోని 31 జిల్లాలకు 31 మంది డీఆర్వోలను కేటాయించారు. రంగారెడ్డి (5), కామారెడ్డి (4), నల్లగొండ, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాలకు ముగ్గురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్‌ (అర్బన్‌), రాజన్నసిరిసిల్ల జిల్లాలకు ఒక్కరు చొప్పున ఆర్డీవోలను కేటాయించారు. మిగిలిన జిల్లాలకు ఇద్దరు ఆర్డీవోలను మంజూరు చేశారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్‌ స్టెనోగ్రాఫర్, జూనియర్‌ స్టెనోగ్రాఫర్, ఒక జమేదార్‌ పోస్టును ఇచ్చారు. తహశీల్దార్‌ స్థాయి అధికారులను అత్యధికంగా నల్లగొండ (40), రంగారెడ్డి (38) జిల్లాలకు కేటాయించారు. అత్యల్పంగా వరంగల్‌ అర్బన్‌ (18), గద్వాల (19)కు మంజూరు చేశారు. ఒక్కో మండలానికి ఒకరు చొప్పున సర్వేయర్లు, మండల గణాంక అధికారులను కేటాయించారు. ఒకరి నుంచి నలుగురు వరకు అదనంగా చైన్‌మెన్లను ఒక్కో మండలానికి మంజూరు చేశారు. దాదాపు ప్రతి జిల్లాకు నాలుగు రికార్డు అసిస్టెంట్‌ పోస్టులను కేటాయించగా, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలకు ఐదుగురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్‌ అర్బన్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ముగ్గురు చొప్పున కేటాయించారు. రంగారెడ్డిలో మాత్రం అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లు ఉండనున్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులను కేటాయించారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలకు మూడు, రంగారెడ్డికి 5 చొప్పున పోస్టులు మంజూరు చేశారు.  

Advertisement
Advertisement