న్యాయం కోసం ఆందోళన | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం ఆందోళన

Published Thu, Aug 27 2015 12:05 AM

న్యాయం కోసం ఆందోళన - Sakshi

 వైద్యం వికటించడంవల్లే చిన్నారి చనిపోయాడని ఆరోపణ
మృతదేహంతో  ధర్నాకు దిగిన బంధువులు
 
 హాలియా : వైద్యం వికటించడం మూలంగానే చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ బుధవారం హాలియాలో మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సిందుజా కాన్పుకోసం ఈ నెల 19న స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. మరునాడే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. మూడు రోజులు బాగానే ఉన్న బాలుడు నాల్గోరోజు రాత్రి ఉన్నట్టుండి చనిపోయాడు. వైద్యం వికటించడం వల్లే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలానెహ్రు ఆసుపత్రికి తరలించారు.

నాలుగు రోజుల చిన్నారికి ఇక్కడ పోస్టుమార్టం చేయలేమని హైదరబాద్‌కు తీసుకుపోవాలని సూచించడంతో హుటాహుటిన హైదరబాద్‌కు తీసుకెళ్లారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం హాలియాకు తీసుకువచ్చారు. డాక్టర్ అజాగ్రత్త కారణంగా తమ బాలుడు చనిపోయినట్టు తేలిందని బాలుడి తండ్రి శంకర్ ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఎలాంటి ఆవాంచనీయ సంఘటలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ స్పందించకపోవడంతో చేసేదిలేక తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఇదిలావుండగా ఈ సంఘటనపై ఆస్పత్రి డాక్టర్ ను వివరణ కోరగా తమ తప్పేమి లేదని బదులిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement