అడవి అటు.. అధికారులు ఎటు..? | Sakshi
Sakshi News home page

అడవి అటు.. అధికారులు ఎటు..?

Published Tue, Jul 22 2014 2:19 AM

అడవి అటు.. అధికారులు ఎటు..? - Sakshi

ఆంధ్రలోకి ముంపు మండలాల్లోని అటవీ ప్రాంతం 
సందిగ్ధంలో అటవీశాఖ అధికారులు


కుక్కునూరు : పోలవరం ముంపు మండలాల్లోని అటవీప్రాంతమంతా సీమాంధ్రలో విలీనం కానుండడంతో ఆ శాఖ అధికారుల్లో సందిగ్ధం నెలకొంది. ఆ మండలాల్లో పని చేస్తున్న అటవీశాఖ అధికారులంతా తెలంగాణకు చెందిన వారు కావడమే ఇందుకు కారణం. కొన్ని అటవీశాఖ చెక్‌పోస్టులు, భద్రాచలం కార్యాలయం మాత్రం తెలంగాణలోనే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 42 అటవీ రేంజ్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏడు ముంపు మండలాలకు చెందిన అటవీరేంజ్ పరిధిలో 2.53లక్షలకు పైగా రిజర్వ్‌ఫారెస్ట్ ఉంది.
 
దీంతో సుమారు 2.40లక్షల హెక్టార్ల అటవీభూమి సీమాంధ్రలో కలుస్తోంది. బూర్గంపాడు మాత్రమే జిల్లాలో మిగలడంతో 13వేల హెక్టార్ల అటవీప్రాంతం మాత్రమే మిగిలింది. మిగిలిని ముంపు మండలాలైన భద్రాచలం, చింతూరు, వీఆర్‌పురం, వేలేరుపాడు, కూనవరంలలో సెంటు అటవీ భూమి కూడా తెలంగాణకు మిగలలేదు. కుక్కునూరు మండలంలోని కుక్కునూరు, అమరవరం రేంజ్ అటవీప్రాంతంలో 51వేల హెక్టార్ల అటవీభూమి ఉండగా కుక్కునూరు రేంజ్ పరిధిలోని 36,919 హెక్టార్లలో 34,580 హెక్టార్లు ఆంధ్రాప్రాంతంలో కలుస్తోంది.

తెలంగాణలోని అశ్వారావుపేట మండంలోని నందిపాడులో 2339 హెక్టార్ల అటవీభూమి మాత్రమే మిగిలింది. అలాగే మండలంలోని అమరవరం రేంజ్ పరిధిలో 15వేల హెక్టార్ల అటవీభూమి ఉండగా తెలంగాణలోని ములకలపల్లి మండలంలో ఉన్న 5వేల హెక్టార్ల అటవీభూమి మాత్రమే మిగులుతోంది. ఇటీవల జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులందరితో జరిగిన చర్చలో ఏడు ముంపు మండలాల్లోని అటవీభూమి ఎక్కువగా ఆంధ్రాకు అప్పగించాల్సి వస్తోందనే అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
 
అధికారుల దారెటు..?

ఏడు ముంపు మండలాల్లోని భద్రాచలం, చర్ల, చింతూరు రేంజ్ అధికారులు ఆంధ్రాకు చెందిన వారుకాగా భద్రాచలం, కుక్కునూరు, అమరవరం, వీఆర్‌పురం, కూనవరం రేంజ్ అధికారులందరూ తెలంగాణకు చెందినవారే. ఆప్షన్లు ఇస్తే ఆ రెండు మండలాలకు చెందిన ఇద్దరు ఆంధ్రా రేంజ్ అధికారులు ఆంధ్రాలో విలీనమైన మండలాలకు బదిలీ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి.

మరోపక్క ఆంధ్రాలో సరిపడా అటవీశాఖ సిబ్బంది లేదనట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ముంపు మండలాల్లో పని చేస్తున్న తెలంగాణ అధికారులే అక్కడా పని చేయాల్సి వస్తుంది. లేదా కొత్తగా నియామకాలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన వారు ఆంధ్ర ప్రాంతంలో పని చేస్తారా..? లేక తెలంగాణలో పనిచేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.  
 
కార్యాలయాలు, చెక్‌పోస్టుల తెలంగాణలోనే..
తెలంగాణలో మిగిలిన భద్రాచలం పట్టణంలో అటవీశాఖ కార్యాలయ సముదాయ భవనం ఉంది. ఆ శాఖ పరిధిలో 27వేల  హెక్టార్ల అటవీభూమి మాత్రం ఆంధ్రాలో కలువనుంది. అదే విధంగా కుక్కునూరు రేంజ్ పరిధిలోని నందిపాడు, గుమ్మడవల్లి అటవీశాఖ చెక్‌పోస్టులు కూడా తెలంగాణలోనే ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement