కన్నీటితో...ఎదురు చూపులు | Sakshi
Sakshi News home page

కన్నీటితో...ఎదురు చూపులు

Published Wed, Jun 11 2014 1:38 AM

కన్నీటితో...ఎదురు చూపులు - Sakshi

ఖమ్మం క్రైం/పాల్వంచ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన ఇంజినీరింగ్ విద్యార్థుల ఆచూకీ లభ్యంకాకపోవడంతో వారి తల్లిదండ్రులకు కన్నీటి ఎదురు చూపులు తప్పడం లేదు. గల్లంతయిన విద్యార్థులలో ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్, పాల్వంచకు చెందిన తల్లాడ ఉపేందర్ ఉన్నారు. సంఘటన జరిగి మూడురోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో ఆఇద్దరు విద్యార్థుల  కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
 
కిరణ్‌కుమార్ తండ్రి వెంకటరమణ బరువెక్కిన హృదయంతో సోమవారం హిమాచల్‌ప్రదేశ్ వెళ్లారు. అక్కడ ఆయన తన కుమారుడి సమాచారం కోసం అధికారులతో మాట్లాడారు.  కిరణ్ తల్లి పద్మావతి, బంధువులు అంతా హైదరాబాద్ చేరుకున్నారు.  ఈ ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులకు ఫోన్లు చేసి తమబిడ్డ గురించి వారు ఆరా తీస్తున్నారు. ఇతర విద్యార్థుల మృత దేహాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో కిరణ్‌కుమార్ సృ్మతులను తలుచుకొని మరింతగా రోదిస్తున్నారు.
 
రియల్‌హీరో కిరణ్....
ఒకవైపు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ నెట్టివేస్తున్నా మొండి పట్టుదలతో నలుగురు స్నేహితులకు చేయిని అందించి పైకి చేర్చాడు కిరణ్‌కుమార్. తాను మాత్రం ప్రవాహంలో కలిసిపోయాడు. ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు కిరణ్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ హైదరాబాద్‌లో కన్నీరు కార్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కిరణ్ తండ్రి వెంకటరమణ బంధువులతో మాట్లాడుతూ తన కుమారుడు నలుగురిని కాపాడటం గర్వంగా ఉన్నా... ఇక తిరిగి రాడని తెలిసి తట్టుకోలేకపోతున్నామన్నారు. కిరణ్ ఎంతో ధైర్యవంతుడని, చిన్నప్పటి నుంచి పక్కవారికి సేవ చేసే స్వభావం కలవాడని బంధువులు పేర్కొన్నారు.
 
ఈ టూర్‌కు కూడా దాదాపు లీడర్‌గా వ్యవహరించాడని, ఈ మధ్య విడుదలైన కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేసినట్లు ఫేస్‌బుక్‌లో పెట్టాడని తెలిపారు. చివరిగా తన ఫేస్‌బుక్‌లో అందరూ సంప్రదాయబద్దంగా ఉండాలని పోస్ట్ చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడని, కిరణ్ సాహసానికి, త్యాగానికి సెల్యూట్ చేయకుండా ఉండలేమన్నారు.
 
దుఃఖ సాగరంలో ఉపేందర్ కుటుంబం..
విషాద సంఘటన చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తున్నా గల్లంతయిన పాల్వంచ విద్యార్ధి తల్లాడ ఉపేందర్ ఆచూకీ కూడా తెలియరాలేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న అతని తల్లి శ్రీదేవి, నానమ్మ సువర్ణ, బంధువులు ఆవేదన చెందుతున్నారు. వారు విలపిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది.  అక్కడి అధికారులు, గజ ఈతగాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పకప్పుడు టీవిల్లో చూస్తూ తమబిడ్డ సురక్షితంగా రావాలని కోరుకుంటున్నారు.

ఉపేందర్ గల్లంతయిన సమాచారం అందుకున్న తండ్రి శ్రీనివాస్ హిమాచల్ ప్రదేశ్‌కు సోమవారం వెళ్లి ఇంకా అక్కడే ఉన్నారు. కొడుకు ఆచూకీ లభించక పోవడంతో అక్కడ శ్రీనివాస్ రోదిస్తూ గడుపుతున్నాడని   బంధువులు తెలిపారు.  ఎప్పటికప్పుడు కొడుకు సమాచారం కోసం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఉపేందర్‌కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఫోన్‌లో ఓదార్చారు.
 
విషాదంలో పరీక్షలు రాస్తున్న తమ్ముడు మహేష్..
వరంగల్‌లో ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉపేందర్ సోదరుడు మహేష్ విషాదంతోనే అక్కడ పరీక్షలకు  హాజరవుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అన్న జాడ తెలియడం లేదని బెంగ ఉన్నా.. ఇక్కడ తల్లి దుఃఖసాగరంలో ఉందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.  
 
 ఎంతో కష్టపడి చదివిస్తున్నాం..
గత ఏడాది నా భర్త పుల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు. ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాం. అయినా బంధువుల సహాయ సహకారాలతో మనుమళ్ళు ఉపేందర్, మహేష్‌లను చదివిస్తున్నాం. మంచి ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటా నానమ్మ అంటు ఉపేందర్ చెప్పేవాడు. మూడు రోజులు గడుస్తున్నా అతని ఆచూకి తెలియడం లేదు. ఆందోళనగా ఉంది.
 - సువర్ణ, నానమ్మ

Advertisement

తప్పక చదవండి

Advertisement