కౌంటింగ్‌ తర్వాత 3 రోజుల్లోనే.. | Sakshi
Sakshi News home page

 జెడ్పీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాలి 

Published Sat, May 18 2019 1:16 AM

Conduct ZP chairperson poll within 3 days of ZPTC/MPTC poll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, ఎంపీపీల ఎంపిక అంశంపై అఖిలపక్షం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 27న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన మూడు రోజుల్లోనే జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డికి అఖిలపక్ష బృందం విజ్ఞప్తి చేసింది. జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకున్నాక జూలై మొదటివారంలో వారు పదవి స్వీకరించేలా చూడాలని, లేనిపక్షంలో కౌంటింగ్‌ను వాయిదా వేయాలని సూచించింది.

కౌంటింగ్‌ పూర్తయ్యాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహిస్తే కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేసే అవకాశముందని పేర్కొన్నాయి. ఈ మేరకు శుక్రవారం నాగిరెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌ అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, ఎం.కోదండరెడ్డి, జి.నిరంజన్‌ (కాంగ్రెస్‌), ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), డాక్టర్‌ చెరుకు సుధాకర్‌(తెలంగాణ ఇంటి పార్టీ), ప్రొ.పీఎల్‌ విశ్వేశ్వరరావు(టీజేఎస్‌), కె.గోవర్థన్‌ (న్యూడెమోక్రసీ) వినతిపత్రం సమర్పించారు.  

విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు... 
రైతుల పొలం పనులు, వర్షాకాలం వచ్చేలోగా ఎన్నికలు పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఎస్‌ఈసీ పరిషత్‌ షెడ్యూల్‌ విడుదల చేసినట్టు నాగిరెడ్డి చెప్పారని అఖిలపక్షనేతలు మీడియాకు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ వాయిదా వేయాలనే విషయంపై అఖిలపక్ష బృందం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారని వారు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఫలితాలు ప్రకటించాక 40 రోజుల తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక చేపడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశముంటుందని కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చామన్నారు. పరిషత్‌ ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో చైర్‌పర్సన్ల ఎన్నిక జరిగేలా చూడాలని కోరినట్లు చెప్పారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నల్లధనం, పోలీసులను ప్రయోగించి అధికారపార్టీ అప్రజాస్వామిక పద్ధతుల్లో ఇతర పార్టీ ల నాయకులను చేర్చుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు పూర్తిచేసి, 3 రోజుల్లో జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని జూలై 5 తర్వాత బాధ్యతలు చేపట్టేలా చూడొచ్చని సూచించామన్నారు. గత 11 నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వమనేదే లేదని, జూలైలో మున్సిపల్‌ ఎన్నికలు పెడతామని ఎన్నికల కమిషన్‌ చెబుతోందని షబ్బీర్‌ అలీ అన్నా రు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యా యని ఆరోపించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, జెడ్పీలు, ఎంపీపీల ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కమిషనర్‌ను కోరినట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చట్టా లంటే ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు.

Advertisement
Advertisement