ఆర్థిక సంఘం నిధులపై అయోమయం | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంఘం నిధులపై అయోమయం

Published Fri, Apr 15 2016 4:12 AM

ఆర్థిక సంఘం నిధులపై అయోమయం

రూ.294 కోట్ల నిధులను  వెనక్కి పంపుతామన్న ట్రెజరీ సిబ్బంది
విడుదల చేసి వారం కాకుండానే  ఎలా ఖర్చు చేస్తామంటున్న సర్పంచ్‌లు

 సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్కారు ఆంక్షలు విధించిందేమోనని రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చేతిదాకా వచ్చిన సొమ్ము(14వ ఆర్థిక సంఘం నిధులు) చేజారిపోతుండడంతో వారంతా లబోదిబోమంటున్నారు. మార్చి 31లోగా వినియోగించని నిధులను జీవో 42 ప్రకారం వెనక్కి పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని ట్రెజరీ సిబ్బంది చెబుతుండగా, అటువంటిదేమీ లేదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గత నెల 24న రెండో విడతగా విడుదల చేసిన  రూ.294 కోట్ల వినియోగంపై అంతటా అయోమయం నె లకొంది. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి రూ.588 కోట్లు మంజూరు చేసింది.

ఇందులో తొలివిడత వచ్చిన రూ.294 కోట్ల నిధులను ఆయా గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయగా, రెండో విడతగా తాగునీరు, పారిశుధ్యం, పంచాయతీల నిర్వహణ నిమిత్తం మరో రూ.294 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెల 14 నుంచే అన్ని గ్రామ పంచాయతీల ఖాతాలను స్థానిక ట్రెజరీ సిబ్బంది నిలుపుదల చేశారు. నిలుపుదల చేసిన గ్రామ పంచాయతీల ఖాతాలకు ఆర్థిక సంఘం నిధులు జమా అయినా సర్పంచ్‌లు వాటిని డ్రా చేసి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 31లోగా వినియోగించని అన్ని నిధులను వెనక్కి పంపుతున్నామని ట్రెజరీ అధికారులు స్పష్టం చేశారు. 

స్పష్టత లేకనే భయాందోళనలు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత లేకపోవడంతోనే ట్రెజరీ అధికారులు సర్పంచ్‌లను భయాందోళనకు గురి చేస్తున్నారు. మార్చి 14న నిలుపుదల చేసిన ఖాతాలకు 24న నిధులు జమచేస్తే వినియోగించుకోవడమెలాగో అర్థం కాని పరిస్థితి సర్పంచ్‌లది. ఇప్పటికే రాష్ట్రమంతటా అన్ని గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సర్పంచ్‌లకు ఇది శరాఘాతంగా మారింది.      
- పురుషోత్తమ్‌రెడ్డి, తెలంగాణ సర్పంచ్‌ల సంఘం కన్వీనర్

ఆ నిధులు ఎప్పటికీ మురిగిపోవు
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు ‘ఎ’కేట గిరి కిందకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ‘సి’ కేటగిరీ కిందకు  వస్తాయి. ‘ఎ’ కేటగిరీ కిందకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు గడువు దాటినా ఎంతమాత్రం మురిగిపోవు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ఆర్థిక సంఘం నిధులకు వర్తించదు కనుక వాటిని ట్రెజరీ అధికారులు వెనక్కి పంపాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులను ఆపొద్దని ఇప్పటికే అన్ని జిల్లాల ట్రెజరీలకు ఆర్థికశాఖ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.
- అనితా రాంచంద్రన్, పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్

Advertisement

తప్పక చదవండి

Advertisement