పొత్తులపై వీడని సస్పెన్స్‌..! | Sakshi
Sakshi News home page

పొత్తులపై వీడని సస్పెన్స్‌..!

Published Sat, Oct 6 2018 9:20 AM

Congress And TDP Alliance Suspense Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఏడెనిమిది స్థానాలు కూటమి సర్దుబాటులో భాగంగా దక్కేవీలుంది. అయినప్పటికీ అన్ని స్థానాలకు 69 మంది ఆశావహులు టికెట్‌ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు. జగిత్యాల, మంథనిల్లోనే ఒక్కో దరఖాస్తు అందినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ధర్మపురిలో నలుగురు, కరీంనగర్‌లో పది మంది మంది, హుజూరాబాద్‌లో ఆరుగురు, పెద్దపల్లిలో ఏడుగురు చొప్పున అన్ని నియోజకవర్గాల్లో (జగిత్యాల, మంథని మినహా)ఇద్దరు నుంచి 10 మంది వరకు పోటీ పడుతున్నారు. పొత్తులపై ఓ వైపు చర్చలు జరుగుతుండగా.. మరోవైపు కూటమి భాగస్వామ్య పార్టీలు కొన్నిచోట్ల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. తెలంగాణ జన సమితి హుజూరాబాద్, కరీంనగర్‌తోపాటు రామగుండం స్థానాన్ని అడుగుతుండగా, తెలుగుదేశం హుజూరాబాద్, కోరుట్ల నియోజకవర్గాలపై ఆశలు వదులుకోలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 12 స్థానాల కోసం పట్టుబట్టిన సీపీఐ 9 స్థానాలకు తగ్గగా.. హుస్నాబాద్‌ నియోజకవర్గంపై మాత్రం కాంగ్రెస్, సీపీఐ పట్టువీడటం లేదు. ఇదే సమయంలో రెండు, మూడు శాసనసభస్థానాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులుంటారన్న మరో చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతోంది. ఒకవేళ మూడు స్థానాలను మినహాయించాల్సి వస్తే.. ఆ స్థానాలు ఏమిటి? అక్కడ టికెట్‌ ఆశిస్తున్న నాయకుల పరిస్థితి ఏంటనేది? చర్చ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో నిలిచే బలమైన నాయకులెవరనే విషయమై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఒక అంచనాకు వస్తున్నారు. ఇందుకనుగుణంగానే అధిష్ఠానం సీటు ఇస్తుందనే భరోసాతో కొందరు నాయకులు ప్రచారంలోనూ ముందుకు కదులుతున్నారన్న వాదన కూడా ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశావహుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
 
ఆరుస్థానాలపై కూటమి పార్టీల గురి.. కాంగ్రెస్‌ ఆశావహుల్లో పొత్తుల కలకలం
పొత్తులు, సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం కాంగ్రెస్‌ సహా కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐల ఆశావహుల్లో కలకలం రేపుతోంది. రాష్ట్రస్థాయిలో పెద్దనాయకులున్న ఈ పార్టీలో టీడీపీ పోటీచేసే స్థానాలపై సందిగ్ధత ఇంకా అలాగే కొనసాగుతోంది. ఈ పా ర్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడుగుతున్నట్లు జిల్లా పార్టీ నాయకులు చెబుతున్నారు. హుజూరాబాద్‌ నుం చి టీడీపీ సీనియర్‌ నాయకుడు ఇనుగాల పెద్ది రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగుతున్నా.. ఆయన కూకట్‌పల్లి నుంచే బరిలో నిలిచేందుకే ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు కోరుట్ల సీటు కోసం కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా పట్టుపడుతుండగా, టీడీపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎల్‌.రమణను నిలపాలనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు చెప్తున్నారు. తెలంగాణ జనసమితి ఉమ్మ డి కరీంనగర్‌ జిల్లాలో జోరైన కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు ఇక్కడి నియోజకవర్గాలపైనే ప్రధాన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

హుజూరాబాద్‌ నుంచి టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ ముక్కెర రాజు, కరీంనగర్‌ నుంచి నరహ రి జగ్గారెడ్డి, రామగుండంలో గోపు అయిలయ్య కు టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అదే విధంగా రాజకీయ కంచుకోటై న ఉమ్మడి కరీంనగర్‌లోని ఒక్కస్థానం నుంచైనా బరిలో నిలువాలనే ప్రయత్నాల్ని సీపీఐ చేపడుతోంది. పట్టున్న హుస్నాబాద్‌ స్థానం కోసం కూ టమి ముంగిట ప్రతిపాదనల్ని పెట్టినట్లు సమాచారం. ఈ పార్టీలోనూ రాష్ట్రస్థాయి నాయకుడు చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సై అంటున్నట్లు సమాచారం. కానీ ఆ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రచారంలో ముందుండటం, కొన్నాళ్లుగా పార్టీ కోసం పాటుపడుతుండటంతో ఆ స్థానంపై గట్టిపోటే ఉండబోతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement