మీ పండుగలే చేసుకోవాలా? | Sakshi
Sakshi News home page

మీ పండుగలే చేసుకోవాలా?

Published Mon, Sep 29 2014 12:14 AM

మీ పండుగలే చేసుకోవాలా? - Sakshi

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత డీకే అరుణ ధ్వజం
 
 హైదరాబాద్: విజయ దశమి, బతుకమ్మ, సంక్రాంతి పర్వదినాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ  తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసుకునే పండుగలనే తెలంగాణ ప్రజలపై రుద్దాలనుకుంటోందని మండిపడ్డారు. దసరాకు సెలవులు పెంచి సంక్రాంతికి సెలవులు తగ్గించడమేంటని ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇష్టమొచ్చిన పండుగలను ఘనంగా జరుపుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణ ప్రజలకు లేదా?  దసరా అంటే తెలంగాణ, సంక్రాంతి అంటే ఆంధ్రా పండుగలని చిత్రీకరించడం అన్యాయం. అసలు మా ప్రాంతంలో బతుకమ్మ పండుగే లేదు. సంక్రాంతి పండుగను 3 రోజులపాటు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. మీరు ఈ పండుగ చేసుకోనంత మాత్రాన ఇతరులెవరూ చేసుకోకూడదా? ఇంతకంటే అన్యాయం ఉందా? ’’అని ధ్వజమెత్తారు.

టీపీసీసీ అధ్యక్ష పదవి కోసమే తాను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నానంటూ ఎంపీ కవిత వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు. కవిత మాదిరిగా పండుగలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే సంస్కృతి మాత్రం తమకు లేదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగకు నిజామాబాద్ ఎంపీ కవితను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు.
 

Advertisement
Advertisement