కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత

Published Tue, Jan 20 2015 3:21 AM

పాలడుగు పార్థివ దేహం - Sakshi

* ఇందిర భవన్‌లో ఆయన భౌతికకాయానికి నేతల ఘననివాళి  
* రేపు నూజివీడులో అంత్యక్రియలు

 
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు (78) సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భార్య సుశీలాదేవితో కలిసి ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడిని పెంచుకున్నారు. అయితే ఆయన కూడా ఇదివరకే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
 
 పాలడుగు మరణవార్త తెలిసి పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన ఆయన భౌతికకాయాన్ని తరువాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, అనంతరం ఇందిర భవన్‌కు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా నాయకులు తరలివచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. తరువాత పాల డుగు భౌతికకాయాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్‌కు తరలించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం అక్కడ ఉంచి, బుధవారం ఉదయం 11 గంటలకు కృష్ణాజిల్లా నూజివీడులోని పాలడుగు తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ పాలడుగు  ప్రత్యేక చొరవ తీసుకుని భూ పోరాటాలు చేశారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థ లకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఉచితంగా ఇచ్చారని గుర్తుచేశారు.
 
పాలడుగు మృతికి సీఎం సంతాపం
 పాలడుగు వెంకట్రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పాలడుగు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన పాలడుగు మృతి కృష్ణాజిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
 
జగన్ సంతాపం
 పాలడుగు వెంకట్రావు మృతిపట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
 
విద్యార్థినేతగా రాజకీయ ప్రస్థానం
 సాక్షి ప్రతినిధి, విజయవాడ: పాలడుగు వెంకట్రావు రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, సమసమాజ స్థాపన కోసం పోరాడిన కార్ల్‌మార్క్స్ జీవితాలపై పాలడుగు పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన 1940 నవంబరు 11న కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండ లం గోగులంపాడులో పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. 1968లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1972 లో ఎమ్మెల్సీగా 1978, 1989ల్లో నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజయ్య, భవనం వెంకట్రామ్, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సభ్యుడిగా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా, పీసీసీ హైపవర్ కమిటీ సభ్యుడిగా, ఏఐసీసీ, పీసీసీల్లో సభ్యుడిగా, పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్‌గా, అధికార ప్రతినిధిగా పనిచేశారు.

Advertisement
Advertisement