'ఆ శాఖల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం' | Sakshi
Sakshi News home page

'ఆ శాఖల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం'

Published Tue, Jul 5 2016 3:12 PM

congress leaders ponguleti, shabbir ali slams telangana government

హైదరాబాద్‌: వ్యవసాయం, విద్య, వైద్య శాఖలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీలు విమర్శించారు. గాంధీ భవన్‌లో మంగళవారం వారు మాట్లాడుతూ.. రుణమాఫీ మూడవ విడత సగమే చెల్లించడం వల్ల రైతులు అప్పుల నుంచి బయటపడలేకపోతున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం, రుణమాఫీ నిధుల్లో మాత్రం కోత పెట్టడం అన్యాయమన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల దాటినా విత్తనాలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

భారతదేశ విత్తన భాండాగారంగా తెలంగాణాను అభివృద్ధి చేస్తామన్న హామీని కేసీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, విత్తనాలు అందడం లేదని అంగీకరించిన వ్యవసాయ మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారో లేదో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో వందలాది ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడ్డాయని, దీనికి ప్రభుత్వ వైఖరే కారణమని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

Advertisement
Advertisement