పార్టీని బలోపేతం చేద్దాం | Sakshi
Sakshi News home page

పార్టీని బలోపేతం చేద్దాం

Published Mon, Nov 24 2014 2:11 AM

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్ - Sakshi

కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షలో నిర్ణయం
మైనార్టీ సమ్మేళనం తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సమ్మేళనాలు
2015లోగా సభ్యత్వం పూర్తి
భేటీలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి,  రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరిన్ని సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. మైనారిటీ సమ్మేళనం తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమ్మేళనాలు జరపాలని, 2015లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదును ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వం ఆదివారం సమీక్షించింది. అన్ని జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు బ్లాక్, మండల, బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా బూత్‌స్థాయి వరకు పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయించాలని, ఏ స్థాయి నేత అయినా తమ బూత్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సూచించారు.
 
పాల్వాయి వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి
 సభ్యత్వ పుస్తకాలు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై మరోసారి వివాదం చెలరేగింది. సమీక్షలో పలువురు నేతలు తమ జిల్లాలో సభ్యత్వ నమోదు గురించి వివరిస్తుండగా.. నల్లగొండ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. పాల్వాయి మాట్లాడుతుండగా రాజగోపాల్‌రెడ్డి అడ్డుపడుతూ.. ‘‘ఒక ఎంపీ అయి ఉండీ తన కూతురును రె బల్‌గా పోటీకి పెట్టించి అభ్యర్థుల ఓటమి కార ణమయ్యారు. అలాంటి వారికి సభ్యత్వ పుస్తకాలు ఎలా ఇస్తారు?’’ అని నిలదీసినట్లు సమాచారం. సమావేశం నుంచి బయటకు వచ్చాక కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీక్ష సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్ సైతం ఎవరికి ఎలాంటి గుర్తింపు ఇస్తున్నారంటూ ఆగ్రహంగా భేటీ నుంచి వెళ్లిపోయారు. అభ్యర్థుల ఓటమికి కారణమైన వారికి సభ్యత్వ పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొదన్న డిమాండ్ అత్యధికుల నుంచి వచ్చిందని సమాచారం.

 ‘పదేళ్ల స్వర్ణయుగం’ బ్రోచర్ విడుదల
 పదేళ్ల యూపీఏ పాలనలో ముస్లింలకు జరిగిన మేలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ‘పదేళ్ల స్వర్ణయుగం’ పేరిట రూపొందించిన బ్రోచర్‌ను సమ్మేళనంలో విడుదల చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తదితరులుఈ బ్రోచర్‌ను విడుదల చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement