గు(బ్యా)డ్ మార్నింగ్.. ఆదిలాబాద్ | Sakshi
Sakshi News home page

గు(బ్యా)డ్ మార్నింగ్.. ఆదిలాబాద్

Published Mon, Nov 17 2014 2:20 AM

Conspiracy on ten kw fm shoud transfers to ap?

పది కిలోవాట్ల ఎఫ్‌ఎంను ఏపీకి తరలించే కుట్ర?
ఒక కిలోవాట్‌తో సరిపెడుతున్న ప్రసారభారతి
స్పందించని జిల్లా ప్రజాప్రతినిధులు

 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
పాలకుల నిర్లక్ష్యం.., ప్రజాప్రతినిధుల పట్టిం పులేని ధోరణి వెరసి జిల్లాకు తరచూ అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు మార్కెట్ కమిటీల నిధులు ఇతర జిల్లాలకు తరలిపోగా, ప్రస్తుతం జిల్లాకు మంజూరైన అధిక సామర్థ్యం పది కిలోవాట్ ఎఫ్‌ఎం రేడియోస్టేషన్ ఏర్పాటు విషయంలోనూ జిల్లాకు అన్యాయం జరుగుతోంది.

దీని స్థానంలో నామమాత్ర సామర్థ్యం ఉండే ఒక కిలోవాట్ ఎఫ్‌ఎం రేడియోస్టేషన్‌ను నెలకొల్పుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల వాసులు ఎఫ్‌ఎం ప్రసారాలను విని ఆనందించే అవకాశాన్ని కోల్పోతున్నారు. పది కిలోవాట్ల స్టేషన్ సామర్థ్యం మంజూరైన స్టేషన్ స్థానంలో ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన స్టేషన్‌ను ఏర్పాటు చేయడం వెనుక పది కిలోవాట్ల స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ప్రారంభమైన పనులు
ఆదిలాబాద్ రేడియో స్టేషన్‌కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1986లో ప్రారంభమైన ఈ స్టేషన్ దేశంలో మూడో ప్రాంతీయ రేడియో స్టేషన్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొదటి స్టేషన్‌గా పేరుగాంచింది. గిరిజన జిల్లాగా పేరున్న ఈ జిల్లా ప్రాంతీయ అవసరాల కోసం కేంద్రం ఎఫ్‌ఎం స్టేషన్‌ను అప్పట్లో నెలకొల్పింది. ఈ స్టేషన్‌ను నెలకొల్పిన తర్వాతే  వరంగల్, తిరుపతి, నిజామాబాద్ వంటి చోట్ల రేడియో స్టేషన్లను నిర్మించింది.

ఇప్పుడు ఈ స్టేషన్ ఆవరణలోనే 10 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రసార భారతి నుంచి రూ.2.64 కోట్లు మంజూరు చేస్తూ ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ తరహాలో ఎఫ్‌ఎం ప్రసారాలను వినవచ్చని జిల్లా వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

తీరా ఇప్పుడు ఈ పది కిలోవాట్ల స్టేషన్ స్థానంలో ఒకే ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన  రేడియో స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పది కిలోవాట్ల సామర్థ్యం కలిగిన స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన ట్రాన్స్‌మీటర్, ఇతర పరికరాలు వస్తాయని స్టేషన్ అధికారులు భావించారు. కానీ ప్రస్తుతానికి ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌మీటర్ మాత్రమే వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఉట్నూర్ వరకే ప్రసారాలు..
ఎఫ్‌ఎం స్టేషన్ సామర్థ్యం పరిమితం కావడంతో కేవలం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పరిసర మండలాల వాసులు మాత్రమే ఈ స్టేషన్ ప్రసారాలను వినగలుగుతారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేయనున్న ఎఫ్‌ఎం స్టేషన్ ద్వారా సుమారు ఉట్నూర్ వరకు ఉన్న గ్రామాల వాసులు మాత్రమే ఈ ప్రసారాలను వినగలుగుతారని రేడియో స్టేషన్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పది కిలోవాట్ల సామర్థ్యం ఉన్న స్టేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలోని మారుమూల ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా ఈ ప్రసారాలను వినే అవకాశం ఉండేది.

Advertisement

తప్పక చదవండి

Advertisement